Saturday, July 27, 2024

గుడిసెవాసుల‌పై దాడి

Must Read
  • క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డిన భూమాఫియా
  • సీపీఐ నాయ‌కుల‌తోపాటు పేద‌ల‌కు తీవ్ర గాయాలు
  • ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్న బాధితులు
  • హ‌న్మ‌కొండ గుండ్ల సింగారంలో తీవ్ర ఉద్రిక్త‌త‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నపేద‌ల‌పై క‌బ్జాదారుల అండ‌తో స్థానికులు దాడికి తెగ‌బ‌డ్డారు. గుడిసెల‌కు నిప్పుపెట్ట‌డ‌మేగాక‌, మ‌హిళ‌లు, వృద్దుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో విరుచుకుప‌డ్డారు. ఈ దాడిలో సీపీఐ హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌ద‌ర్శి క‌ర్రె బిక్ష‌ప‌తి, ఎన్ ఎఫ్ ఐ డ‌బ్య్లూ రాష్ట్ర కార్య‌ద‌ర్శి నెదునూరి జ్యోతి, మండ స‌దాల‌క్ష్మితోపాటు సుమారు 35 మంది తీవ్ర గాయాల‌పాల‌య్యారు. వీరంతా ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎంజీఎం ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్ర‌భుత్వ భూమిపై క‌న్నేసిన క‌బ్జాదారుల ప్రోత్బ‌లంతోనే త‌మ‌పై దాడి జ‌రిగింద‌ని, దాడి జ‌రుగుతున్న‌ప్పుడు పోలీసులు ఉన్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించార‌ని బాధితులు ఆరోపించారు.

అస‌లేం జ‌రిగింది..

హన్మకొండ, వరంగల్ జిల్లాల్లోని ప్ర‌భుత్వ భూముల్లో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ఇటీవ‌ల వేలాది మంది పేద‌లు గుడిసెలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 2వ డివిజ‌న్ గుండ్ల సింగారం ప‌రిధిలోని సర్వే నెంబర్ 177లో సీపీఐ పార్టీ ఆధ్వ‌ర్యంలో మూడు వేల మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. కాగా.. సోమ‌వారం గుడిసెవాసుల‌కు, స్థానికులకు మధ్య తీవ్ర ఘర్షణ మొదలైంది. దీంతో స్థానికులు కొంద‌రు గుడిసెల‌కు నిప్పుపెట్టి త‌గుల‌బెట్టారు. ప్ర‌భుత్వ భూమిలోకి రాకుండా ముళ్ల కంచెలు అడ్డుపెట్టి అడ్డుకుని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. గుడిసెవాసుల‌పై దాడికి తెగ‌బ‌డ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి భారీగా చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈక్ర‌మంలోనే మంగ‌ళ‌వారం ఉద‌యం ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్తున్న సీపీఐ నేత‌ల‌తో పాటు గుడిసెవాసుల‌పై క‌ర్ర‌లు, రాళ్లు, గొడ్డ‌ళ్ల‌తో మ‌ళ్లీ విరుచుకుప‌డ్డారు. ఆ దాడిలో ప‌లువురు మ‌హిళ‌ల‌తోపాటు వృద్దుల‌కు కూడా గాయాలైన‌ట్లు బాధితులు ఆరోపించారు. గుండ్ల సింగారంలోని ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించేందుకే ప‌థ‌కం ప్ర‌కారం పేద‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డార‌ని బాధితులు ఆరోపించారు. స్థానిక కార్పొరేట‌ర్ అండ‌తోనే భూక‌బ్జాదారుల‌కు త‌మ‌పై దాడికి దిగార‌ని మండిప‌డ్డారు. త‌మ‌పై దాడి జ‌రుగుతున్నా పోలీసులు ఆప‌లేద‌ని, ప్రేక్ష‌క‌పాత్ర పోషించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాగా, పేద‌ల‌పై దాడికి పాల్ప‌డిన నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీపీఐ నాయ‌కులు కోరారు. కేసులు , దాడుల‌కు భ‌య‌పడేదిలేద‌ని ప్ర‌భుత్వ భూమి పేద‌ల‌కు దక్కే వ‌ర‌కూ ఉద్య‌మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

దాడుల‌కు, కేసుల‌కు భ‌య‌ప‌డం
సీపీఐ హ‌న్మ‌కొండ జిల్లా కార్య‌ద‌ర్శి క‌ర్రె భిక్ష‌ప‌తి

నిన్న జరిగిన దాడిలో గాయ‌ప‌డిన గుడిసెవాసుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్తున్న త‌మ‌పై క‌బ్జాదారులు దాడికి తెగ‌బ‌డ్డారు. క‌త్తులు, గొడ్డ‌ళ్లు, రాళ్ల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా విరుచుకుప‌డ్డారు. క‌బ్జాదారుల దాడిలో మ‌హిళ‌లు, వృద్దుల‌తోపాటు మా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు 35 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పోలీసులు దాడిని ఆప‌కుండా ప్రేక్ష‌క‌పాత్ర పోషించారు. కేసులు, దాడుల‌కు భ‌య‌ప‌డేదిలేదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పేద‌ల‌కు భూమి ద‌క్కే వ‌ర‌కూ సీపీఐ ఉద్య‌మిస్తుంది.

దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం..
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రి

హన్మకొండ జిల్లా గుండ్ల సింగారం భూపోరాటంలో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం కొంతమంది భూమాఫియా దాడికి పాల్ప‌డ‌టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో గాయపడిన సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, ఎన్ ఎఫ్ ఐ డ‌బ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి నేదునూరు జ్యోతి, సదలక్ష్మితోపాటు మహిళా నాయకులకు తీవ్ర గాయాల‌య్యాయి. బెదిరింపులు, దాడుల‌తో భూపోరాటాలను ఆపలేరు.

కబ్జాదారులపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
ఏఐఎస్ఎఫ్ హ‌న్మ‌కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషభోయిన సంతోష్
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నెల రోజుల నుండి నిరుపేదలు, ఇల్లులేని వారు గుడిసెలు వేసుకుని పోరాటం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండ్ల సింగారంలో గుడిసెవాసుల‌పై 250 మంది భూకబ్జాదారులు, రౌడీలు, గూండాలు ఒక్కసారిగా దాడికి పాల్ప‌డ‌గా, ప‌లువురు గాయాలపాలయ్యారు. బాధితుల‌ను పరామర్శించడానికి వెళ్లిన సీపీఐ నాయకులు, కార్యకర్తల‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడ్డ భూకబ్జాదారుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img