- రాకేశ్ మృతదేహానికి మంత్రులు, ఎమ్మెల్యేల నివాళి
- ఎంజీఎం నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి భారీ ర్యాలీ
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : అగ్నిపథ్ నిరసనలో భాగంగా నిన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన దామెర రాకేశ్ మృతదేహంతో వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.
తొలుత ఎంజీఎం మార్చురీ వద్ద రాకేశ్ మృతదేహాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రెడ్యానాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవితతోపాటు కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక వాహనంలో రాకేశ్ మృతదేహం ఉంచి భారీ ర్యాలీగా స్వగ్రామానికి తరలించారు. ఉదయం 10 గంటలకు ఎంజీఎం నుంచి మొదలైన ర్యాలీ 11:30 వరకు కొనసాగింది. గొర్రెకుంట వరకు నేతలు కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాదాపు 2000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ శ్రేణుల వీరంగం
రాకేశ్ అంతిమయాత్ర ర్యాలీలో టీఆర్ఎస్ శ్రేణులు వీరంగం సృష్టించారు. వరంగల్ పోచంమైదాన్ సెంటర్‌లోని బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్‌పై టీఆర్ ఎస్ శ్రేణులు దాడికి యత్నించాయి. ఎంజీఎం నుంచి గొర్రెకుంట వరకు చేపట్టిన ర్యాలీ పోచమ్‌మైదాన్ బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ వద్దకు చేరుకోగానే.. టీఆర్ ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. గేటకు ఉన్న బ్యానర్‌ను కొందరు వ్యక్తులు తగులబెట్టగా, మరికొందరు ఆఫీస్ పైకి చెప్పులు విసిరారు. పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు వెనక్కితగ్గారు. దీంతో వరంగల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.