Saturday, July 27, 2024

అమ్మిందెవ‌రు..? కొన్న‌దెవ‌రు?

Must Read
  •  ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్‌ యూనియ‌న్ కార్యాల‌యం
    కార్మికుల సొంతం
  •  16ఏళ్లకే ఏజేఎంలో చేరా..
  •  1950 నుంచి 1990 వ‌ర‌కు ప‌నిచేశా
  •  చందాలతో స్థ‌లంకొని కార్యాల‌యం క‌ట్టుకున్నాం..
  •  సుమారు 12ఏళ్లు కోశాధికారిగా ప‌నిచేశా
  •  ఏజేఎం వ‌ర్క‌ర్స్‌ ఆఫీస్‌ను కాపాడుకుంటాం..
  •  అక్క‌డికి ఎవ‌రొస్తారో చూస్తాం..
  •  ఏజేఎం విశ్రాంత‌ కార్మికుడు మార్త శేఖ‌ర్‌
  •  అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ..

ఆజం జాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌యం కార్మికుల ఆస్తి.. చందాలు వేసి.. భూమి కొనుగోలు చేసి.. కార్యాల‌యం క‌ట్టుకున్నాం.. దీనికి ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంది. ఇక్క‌డి నుంచి ఎందరో గొప్ప నాయ‌కులుగా ఎదిగారు. రాజ‌కీయాల్లో రాణించారు. కార్మిక‌లోకానికి వెన్నుద‌న్నుగా నిలిచారు. అలాంటి చరిత్ర‌ను క‌బ్జా చేసిన‌ట్లు తెలుస్తోంది. కార్మికుల ఆస్తిని కాజేందుకు ప్ర‌య‌త్నం చేస్తే ఊరుకునేదిలేదు. అస‌లు అమ్మ‌డానికి వారెవ‌రు..? కొన‌డానికి వీరెవ‌రు? అది కార్మికుల క‌ష్టార్జితం! అక్క‌డికి ఎవ‌రొస్తారో.. ఎవ‌రు మాట్లాడుతారో..! చూస్తాం. దానిని కాపాడుకోవ‌డానికి ఎంత‌వ‌ర‌కైనా పోరాడుతాం.. అని ఉద్వేగంతో చెబుతున్నారు ఏజేఎం రిటైర్డ్ కార్మికుడు మార్త శేఖ‌ర్‌. వ‌రంగ‌ల్ వెంక‌ట్రామా థియేట‌ర్ స‌మీపంలోని ద‌శాబ్దాల చరిత్ర‌గ‌ల ఆజం జాహి మిల్స్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ కార్యాల‌య స్థ‌లం కార్మికుల‌దా..? లేక‌.. ప్రైవేట్ వ్య‌క్తిదా..? అన్న అంశం వివాదాస్ప‌ద‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఐదు ద‌శాబ్దాల‌పాటు మిల్లులో ప‌నిచేసిన కార్మికుడు మార్త శేఖ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తితో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. కార్యాల‌యం పూర్వాప‌రాల‌ను చ‌ర్చించారు. అది ముమ్మాటికీ కార్మికుల ఆస్తి అని స్ప‌ష్టం చేశారు.
-అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి

  • ప్ర‌శ్న‌: ఏజేఎంలో మీరు ఎంత‌కాలం ప‌నిచేశారు?
    శేఖ‌ర్ : నేను 1950లో మిల్లులో కార్మికుడిగా చేరా. అప్పుడు నా వ‌య‌స్సు 16ఏళ్లే. 12ఏళ్లు మిల్లు క్యాంటిన్‌లో, 28ఏళ్ల‌పాటు వైండింగ్‌లో ప‌నిచేశా. ఆ త‌ర్వాత 1990లో రిటైర్డ్ అయ్యాను. 1951లో మిల్లులో 362 క‌ప‌డా కాతాలుండేవి. అప్పుడు కార్మికులు సుమారు 3వేల మంది ప‌నిచేసేవారు. ఆ త‌ర్వాత 1952లో అనుకుంటా.. క‌ప‌డా కాతాల‌ను 362 నుంచి 724కు పెంచారు. దీంతో కార్మికుల సంఖ్య కూడా పెరిగింది. సుమారు 4500మంది ప‌నిచేసేవారు. నెలంతా ప‌నిచేస్తే నా జీతం కేవ‌లం రూ.25. మ‌న వ‌రంగ‌ల్‌లోని ఆజం జాహి మిల్లుకు ప్ర‌పంచ‌లో గొప్ప చ‌రిత్ర ఉంది. ఇది ప్లాన్డ్ మిల్లు. మిల్లుకు దూది వ‌స్తే.. అది అన్ని ద‌శ‌ల‌ను పూర్తి చేసుకుని బ‌ట్ట‌గా త‌యారై బ‌య‌ట‌కు వ‌చ్చేది. బ్లో రూమ్‌, కార్డ్ రూమ్‌, ఫ్రేమ్‌, రింగ్‌, వైండింగ్‌, వార్పింగ్‌, నైచింగ్‌, వీవింగ్‌, ఫోల్డింగ్‌, డైయింగ్ నుంచి నేరుగా క్లాత్‌గోదాంకు బ‌ట్ట చేరుకుంటుంది. ఇలాంటి మిల్లు మ‌రెక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌దు. అంత‌గొప్ప మిల్లులో ప‌నిచేయ‌డం నా అదృష్టం. కార్మికులు మూడు షిఫ్టుల్లో ప‌నిచేసేవారు. ఉద‌యం 7గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3గంట‌ల వ‌ర‌కు, ఆ త‌ర్వాత 3గంట‌ల నుంచి రాత్రి 11గంట‌ల వ‌ర‌కు, 11గంట‌ల నుంచి ఉద‌యం 7గంట‌ల వ‌ర‌కు షిఫ్టులుండేవి. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలోనూ ఇక్క‌డి నుంచి సైనికుల‌కు బ‌ట్ట‌లు వెళ్లేవి. అంత‌టి ఘ‌న‌మైన చ‌రిత్ర ఏజేఎం సొంతం. అంత‌ర్జాతీయంగా వ‌చ్చిన సాంకేతిక ప‌రిణామాల నేప‌థ్యంలో క్ర‌మంగా మిల్లు ప్రాభ‌వం కోల్పోయింది. 2002లో మొత్తంగా మూత‌ప‌డింది.
  • ప్ర‌శ్న‌: ఏజేఎం వ‌ర్క‌ర్స్‌ కార్యాల‌యం ఎప్పుడు ప్రారంభమైంది?
    శేఖ‌ర్ : ఏడో నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్‌ వ‌రంగ‌ల్‌లో 1943లో సుమారు 206 ఎక‌రాల స్థ‌లంలో ఆజంజామి మిల్లు ప్రారంభించారు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికే యూనియ‌న్ ఏర్ప‌డింది. మొద‌ట యూనియ‌న్ కార్యాల‌యం వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ రోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉండేది. ఆ త‌ర్వాత సుమారు 1954 త‌ర్వాత అనుకుంటా ల‌క్ష్మీపురం అంటే ఇప్పుడు వెంక‌ట్రామా థియేట‌ర్ స‌మీపంలో అప్ప‌టి యూనియ‌న్ అధ్య‌క్షుడు రాధాకృష్ణ హయాంలో కార్మికులంద‌రం చందాలు వేసుకుని భూమి కొనుగోలు చేశాం. 1957లో యూనియ‌న్ కార్యాల‌యం ప్రారంభించుకున్నాం. ఇక నేను కూడా 1972 నుంచి సుమారు 12ఏళ్ల‌పాటు కోశాధికారిగా ప‌నిచేశాను. ఏరోజు కూడా ఎవ‌రూ ఈ కార్యాల‌యం నా సొంత‌మంటూ రాలేదు. నిజంగానే అది ప్రైవేట్ వ్య‌క్తి ఆస్తి అయితే.. ఆ య‌జ‌మాని ఒక్క‌సారైనా రావాలి క‌దా..? అవ‌న్నీ ప‌చ్చి అబ‌ద్ధాలు. ఇప్పుడు ఎవ‌రో అమ్మితే మ‌రెవ‌రో కొన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంటే న‌వ్వొస్తోంది. ఇక్క‌డ మీకు ఒక విష‌యం చెబుతా.. డాక్ట‌ర్‌ బండా ప్రకాష్‌ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న‌ప్పుడు 2020లో అనుకుంటా.. ఈ కార్యాల‌యం స్థానంలో ఏజేఎం మిల్స్ వ‌ర్క‌ర్స్ వెల్ఫేర్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ క‌ట్ట‌డానికి కూడా త‌న ఎంపీ నిధులు విడుద‌ల చేశారు తెలుసా..? ఎవ‌రెన్ని దొంగ ప‌త్రాలు సృష్టించినా అది ముమ్మాటికీ కార్మికుల ఆస్తి. అక్క‌డికి ఎవ‌రు వ‌స్తారో మేమూ చూస్తాం.
  • ప్ర‌శ్న‌: యూనియ‌న్‌లో మీరు ఏస్థాయిలో ప‌నిచేశారు?
    శేఖ‌ర్ : యూనియ‌న్‌ మొద‌టి అధ్య‌క్షుడు స‌మ‌ద్ ర‌జ్వీ, ఆ త‌ర్వాత రామ‌నాథం, రాధాకృష్ణ‌, సుద‌ర్శ‌న్‌, స‌త్య‌నారాయ‌ణ‌, నాగ‌భూష‌ణం, సుంద‌ర్‌రాజు, ఎల్ఎస్ రాజు, పురుషోత్తమ‌రావు లాంటి గొప్ప‌నాయ‌కులు యూనియ‌న్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్‌గా ఉన్న బండా ప్ర‌కాష్ కూడా గౌర‌వ అధ్య‌క్షుడిగా కొంత‌కాలం ఉన్నారు. ఆ అనుబంధంతోనే ఈ కార్యాల‌యం స్థానంలో ఏజేఎం మిల్స్ వ‌ర్క‌ర్స్ వెల్ఫేర్ అండ్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ క‌ట్ట‌డానికి కూడా త‌న ఎంపీ నిధులు విడుద‌ల చేశారు. ఇక అప్ప‌టి నుంచి ఆ కార్యాల‌యం ఇప్ప‌టిదాకా కార్మికుల ఆస్తిగా ఉంటోంది. ఎంతోమంది ఇక్క‌డి నుంచి గొప్ప నాయ‌కులుగా ఎదిగారు. రాజ‌కీయాల్లో రాణించారు. ఇక యూనియ‌న్‌లో 1972 నుంచి సుమారు 12 ఏళ్ల‌పాటు కోశాధికారిగా ప‌నిచేశాను. 1990లో రిటైర్డ్ అయిన త‌ర్వాత కూడా మ‌ళ్లీ కొంత‌కాలం ప‌నిచేశాను. నా జీవిత‌మంతా మిల్లుతోనే ముడిప‌డి ఉంది. యూనియ‌న్ కార్య‌క‌లాపాల‌తోనే గ‌డిచిపోయింది. అలాంటి యూనియ‌న్ కార్యాల‌య స్థ‌లాన్ని ఎవ‌రో కాజేసేందుకు కుట్ర‌లు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తేలేదు. కాపాడుకుని తీరుతాం.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img