టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 19 వరకు సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం సబ్ జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను ఖమ్మం జైలుకి తరలించనున్నారు. కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు లాయర్లు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హన్మకొండ కోర్టు దగ్గరకు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో కోర్టు దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.