Tuesday, September 10, 2024

త‌గ్గేదే లే..!

Must Read
  • మ‌రింత దూకుడు పెంచిన కేసీఆర్‌
  • లఖీంపూర్ ఖేరీని సందర్శించ‌నున్న ముఖ్య‌మంత్రి
  • బాధిత రైతు కుటుంబాలకు పరామ‌ర్శ‌
  • త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ‌

కేంద్రంతో అమీతుమీకి సిద్ధ‌మైన సీఎం కేసీఆర్‌.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుల అంశంలో బీజేపీపై పోరును కొనసాగిస్తామన్న ఆయ‌న తాజాగా మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఈసారి ప‌ది రోజులపాటు అక్కడే మ‌కాం వేయ‌నున్న‌ట్లు సమాచారం. అయితే ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్‌.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖీరీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిశ్ మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు కేంద్రమైన లఖీపూర్ ఖేరీని సందర్శించి, బాధిత రైతు కుటుంబాలను కేసీఆర్ కలవనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు స‌మాచారం. నిజానికి యూపీ ఎన్నికల సమయంలోనే కేసీఆర్ అక్కడికి వెళ్లాలని భావించినా, చివరి నిమిషంలో ఆగిపోయారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై యుద్దాన్ని మరింత ఉధృతం చేస్తున్న కేసీఆర్ .. రైతులపై హింసాకాండ చోటుచేసుకున్న లఖీంపూర్ ఖేరీని సందర్శించనుండ‌టం సంచ‌ల‌నంగా మారింది. కేసీఆర్ నిర్ణ‌యం జాతీయ స్థాయిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. గతంలో లఖీంపూర్ సందర్శనకు వెళ్లిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్ర‌తిప‌క్షాల నేత‌ల‌ను ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వం అడ్డుకుంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు ఎలాంటి అనుభవం ఎదురుకాబోతున్నదనేది ప్ర‌స్తుతం ఉత్కంఠగా మారింది. రైతులు, జర్నలిస్టు, బీజేపీ కార్యకర్తలు అంతా కలిపి 8 మంది మృతి చెందిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై కేంద్రంలో, ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర నిరసనలు పెల్లుబికిన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా రైతులకు క్షమాపణలు చెప్పి, మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అయితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడంతోపాటు లఖీంపూర్‌ ఖీరీలోనూ ఆ పార్టీ అభ్యర్థే విజయం సాధించారు. ఈనేప‌థ్యంలోనే లఖీంపూర్ ఘటనకు ప్రాధాన్యం తగ్గుతోందనుకునేలోపే కేసీఆర్ మళ్లీ దానిని హైలైట్ చేసేందుకు సమాయత్తం అవుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img