టీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా..?
నేడో, రేపో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సడన్‌గా ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అసలు పీకే వ్యూహమేంటి..? ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారా..? లేదా టీఆర్ఎస్ కు వ్యూహకర్తగా పనిచేస్తారా..? అన్నది చర్చనీయాంశం అవుతోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడుసార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని మీడియాలో ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే హఠాత్తుగా ఢిల్లీ నుంచి శనివారమే హైదరాబాద్ వచ్చిన పీకే.. నేరుగా ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ తో సుదీర్ఘ మతనాలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం కూడా పీకే-కేసీఆర్ భేటీ ఉంటుందని, పలు దఫాలుగా వీరు పలు అంశాలను చర్చించుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు వీలుగా పీకే శనివారంరాత్రి ప్రగతి భవన్‌లోనే బస చేశారని కూడా మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే పీకే, కేసీఆర్ భేటీపై కాంగ్రెస్ పార్టీలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌కు కటీఫ్ చెప్పడానికే ప్రశాంత్ కిశోర్ ప్రగతి భవన్ వచ్చారని, ఆ పనిని గౌరవ ప్రదంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కోరిక మేరకు రెండు రోజులపాటు కలిసుండటానికి అంగీకరించారని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అంతేగాక బహుశా ఇదే కేసీఆర్ – పీకే ఆఖరి సమావేశం కావొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. పీకే కాంగ్రెస్‌లో చేరబోవడంలేదని, వ్యూహకర్తగా మాత్రమే పనిచేస్తారని చర్చించుకుంటున్నారు.