ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ పర్యటన వేళ అపశృతి చోటుచేసుకుంది. స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని మోడీ తొలిసారి పర్యటిస్తున్నారు . ఆదివారం ప్రధాని మోదీ రాక సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో భారీ కార్యక్రమాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రధాని రాకకు ముందు, ఆయన నిర్వహించబోయే సభకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు జరగడం కలకలం సృష్టించింది.
సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో బహిరంగ సభను ఉద్దేశించి మోడీ మాట్లాడనున్నారు. కాగా సభా స్థలికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియన్ గ్రామంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలో బిష్నా పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో పేలుడుపై భద్రతా బలగాలు ఆరా తీస్తున్నాయి. గ్రామంలోని బహిరంగ వ్యవసాయ భూమిలో అనుమానాస్పద పేలుడు సంభవించినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నది. అదే సమయంలో మోదీ పర్యటనకు అసాధారణ భద్రత కల్పించారు.