- పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
- రికార్డులు, వంటగది, స్టోర్ రూమ్ పరిశీలన..
- విద్యార్థులతో మాట్లాడి వివరాల సేకరణ..
అక్షరశక్తి, గూడూరు: గూడూరు గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం పాఠశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. మెనూ పాటించడం లేదని, తాగునీటికి ఇబ్బంది ఉందని, వార్డెన్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ ఉదయం టిఫిన్ తినకుండా పాఠశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు.
వార్డెన్ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, కలెక్టర్ రావాలని విద్యార్థులు నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఏటీడీవో భాస్కర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఖాసీం, సర్పంచ్ నువ్వు నవత్ రమేష్ నాయక్ ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అదనపు కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మెనూ పాటించడం లేదని, వార్డెన్ సమీప బంధువులు ఆశ్రమ పాఠశాల ఆవరణలోకి వస్తున్నారని దీంతో తమకు ఇబ్బందిగా ఉందని, తాగునీటి సమస్య జటిలంగా ఉందని విద్యార్థులు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి తీసుకెళ్లారు. తరగతి గదులు, వంటగది, సరకుల నిల్వ చేసే గదిని పరిశీలించారు. రికార్డులను పరిశీలించి వార్డెన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ను మీడియా వివరణ కోరగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.