పాల్గొన్న ఎమ్మెల్యే పెద్ది, వరంగల్ కలెక్టర్ గోపి
అక్షరశక్తి, నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు దెబ్బతిని నియోజకవర్గ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. నల్లబెల్లి మండలం మేడిపల్లి, రాంపూర్ గ్రామాల్లో పర్యటించి ఈదురు గాలులకు ఇండ్లు కూలిపోయిన వారిని పరామర్శించి తక్షణ సాయం అందించారు. బుధవారం ఉదయం వర్షంలోనే దుగ్గొండి, కానాపురం మండలాల్లో పర్యటించి పంటనష్టాన్ని పరిశీలించారు. బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే వరంగల్ కలెక్టర్ గోపి, ఉన్నతాధికారులు బృందంతో నియోజకవర్గంలో పర్యటించారు. తీవ్రంగా పంట నష్టం జరిగిన ఇటుకాల పల్లి చుట్టూ పక్కల తడాలతో పాటు, మేడేపల్లి, నరసింగా పూర్, కొండాయిల పల్లె, గ్రామాల్లో పర్యటించి బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంటనే నష్టపరిహారాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించి రైతులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట రూరల్, నల్లబెల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆర్డీఓ, రెవెన్యూ, వ్యవసాయాధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.