Tuesday, June 18, 2024

భ‌లేభ‌లే బకెట్ బిర్యానీ !

Must Read

 

  • పొట్లంపోయి బకెట్లు వచ్చిన‌య్ !
  • రంగు రంగుల బకెట్ల‌లో ఘుమ‌ఘుమ‌లాడే బిర్యానీ 
  • న‌గ‌రంలో న‌యా ట్రెండ్
  • ఫుడ్ ల‌వ‌ర్స్ ఫిదా !
  • రెడ్‌, గ్రీన్‌, హాట్‌, మాస్ట‌ర్ బ‌కెట్ల పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్న వ్యాపారులు

బిర్యానీ… ఈపేరు వింటేనే భోజన ప్రియులకు నోరు ఊరుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ బిర్యానీ.. మాంసాహారులు ఇష్టంగా ఆర‌గించే వాటిలో బిర్యానీదే సింహ‌భాగం. అందులోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే వద్దు అనే వాళ్ళు వుండ‌రంటే అతిశ‌యోక్తికాదు. వ‌రంగ‌ల్ మ‌హా నగరంలోనూ బిర్యానీ ప్రియుల కోసం అనేక రెస్టారెంట్లు, బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. అయితే.. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోడానికి విభిన్న ప‌ద్ధ‌తుల‌ను అనుస‌రిస్తున్నారు. బిర్యానీ ప్రియులను ఆకర్షించాలంటే రుచితోపాటు పార్సిల్ కూడా ముఖ్యం అని భావించిన నిర్వాహ‌కులు బకెట్ బిర్యానీ కాన్సెప్ట్‌కు తెర‌లేపారు. సింపుల్‌గా ఆర్డర్ వేసి బ‌కెట్‌లో బిర్యానీ తెస్కెళ్ళడమే బకెట్ బిర్యానీ కాన్సెప్ట్. బిర్యానీ పాతదే… కానీ ప్యాకింగ్ కొత్తది. క్వాలిటీ బకెట్‌లో వేడి వేడిగా ప్యాకింగ్ చేసి అందించడం న‌యా ట్రెండ్.. ఇదే కష్టమర్ల‌కు నచ్చింది. సింగిల్‌, ప్లేట్‌, ఫుల్‌, ఫ్యామిలీ ప్యాక్ ఇలా … ఏ మోతాదులో కావాల‌న్నా ఆ సైజ్ రంగురంగుల బ‌కెట్ల‌లో నోరూరించే బిర్యానీని అందిస్తున్నారు. రెడ్, గ్రీన్‌, హాట్, మాస్ట‌ర్ బ‌కెట్ పేరుతో న‌గ‌రంలో వెలుస్తున్న బిర్యానీ సెంట‌ర్లు భోజ‌నప్రియుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

పెరుగుతున్న డిమాండ్‌

20 యేళ్ళ క్రితం బిర్యానీ తినాలంటే వరంగల్ నగరంలో కొన్ని రెస్టారెంట్లే అందుబాటులో వుండేవి. జనాభా పెరుగుతున్న నేపథ్యం, ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు అవుతున్న సందర్భాన్ని బట్టి హైదరాబాద్ బిర్యానీకి అలవాటుపడ్డారు. హైదరాబాద్ బిర్యానీ కావాలంటే టాప్ రెస్టారెంట్ల‌లో ఒకటైన ప్యారడైజ్ నుండి తెచ్చుకునే వాళ్ళు. బిర్యానీకి పెరుగుతున్న ఆదరణను చూసి వ‌రంగ‌ల్ నగరంలోనూ అనేక బిర్యానీ పాయింట్లు పెరిగాయి. ఒక సాధారణ పార్సిల్ బిర్యానీ రూ.150 వుండేది. పదేళ్ల క్రితం హ‌న్మ‌కొండ అదాలత్ సర్కిల్‌లో స్పెన్సర్ వాళ్ళు తూకం వేసి కిలో బిర్యానీ అందించేవారు. తక్కువ ధరకే బిజినెస్ ప్రారంభించారు. ఈ కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ కావడంతో అందరూ అదే ఫార్ములాని నమ్ముకున్నారు. రూ.100 లోపు హాట్ హాట్ బిర్యానీ దొరకడంతో బిర్యానీ తినే అలవాటు పెరిగింది. సింగిల్ బిర్యానీ రూ. 70 నుండి మొదలు రూ.150 వరకు లభిస్తున్నది. ఏ రంగంలో ఐనా పోటీ తప్పదు. పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న బిర్యానీ పాయింట్లు, వాటి మధ్య వార్ అనివార్యం అయింది. నయీంనగర్ నుండి నిట్ వరకు సుమారు 50కిపైగా బిర్యానీ సెంటర్లు వున్నాయి. బిర్యానీ ప్రియులను ఆకర్షించాలని అంటే రుచితో పాటు పార్సిల్ కూడా ముఖ్యం అని భావించిన నిర్వాహ‌కులు బకెట్ బిర్యానీ కాన్సెప్ట్ కు తెర‌లేపారు. రెడ్ బకెట్ పేరుతో మిర్యాలగూడకు చెందిన బిర్యానీ ఫ్రాంచైజ్ ప్రారంభం అయింది. ఆకర్షణీయం గా ప్లాస్టిక్ బ్యాకెట్లో వేడి వేడి బిర్యానీ ఇవ్వడం ప్రారంభించిడంతో ఈ కొత్త ప్రయోగం అందరినీ ఆక‌ట్టుకుంటోంది.

రంగు రంగుల బకెట్లు ..

కొత్త ఒక వింత, విభిన్నం… ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ. నిత్యం కస్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవడానికి ఏదో ఒకటి చేస్తూనే వుండాలి. బిర్యానీ పాతదే… కానీ ప్యాకింగ్ కొత్తది. క్వాలిటీ బకెట్‌లో వేడి వేడిగా ప్యాకింగ్ చేసి అందించడం న‌యా ట్రెండ్.. ఇదే కష్టమర్ల‌కు నచ్చింది. అదే బాటలో మరి కొన్ని బకెట్లు వచ్చాయి. ఏక శిలా పార్క్ రోడ్‌లో రెడ్ బకెట్‌తో పాటు నగరంలో హంటర్ రోడ్‌లో హాట్ బకెట్, బీఎడ్ కాలేజ్ ఎదురుగా గ్రీన్ బకెట్, అంబేద్కర్ జంక్షన్ దగ్గర మాస్టర్ బకెట్ పేరుతో బిర్యానీ సెంటర్లు ప్రారంభం అయ్యాయి. ఘుమ ఘుమలాడే బిర్యానీ ఒకటే… కానీ బకెట్ రంగులు వేరు.

సింగిల్ టు ఫ్యామిలీ బకెట్లు

ఇప్పుడు నయా ట్రెండ్ నడుస్తోంది. కిలో బిర్యానీ నుంచి కస్ట‌మ‌ర్ల సంఖ్య‌ను బట్టి విభిన్న సైజుల్లో బకెట్లు వచ్చాయి. వన్ పర్సన్, టూ పర్సన్, ఫ్యామిలీ బకెట్ పేరుతో బిర్యానీ బకెట్లు వచ్చాయి. ఇప్పుడైతే ప్యాకెట్ నుండి బకెట్‌కు వచ్చిన బిర్యానీ ట్రెండ్ రానున్న కాలంలో ఎలాంటి మార్పు చెందుతుందో వేచి చూడాలి.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img