Friday, September 13, 2024

మోడల్ స్కూల్‌లో దొడ్డు బియ్యంతో భోజనం

Must Read
  • తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు
  • ప్రిన్సిపాల్‌, ఎంఈవో, గోదాం ఇన్‌చార్జిల పొంత‌న‌లేని స‌మాధానాలు

అక్షరశక్తి, మహబూబాబాద్ : ప్ర‌భుత్వ హాస్ట‌ళ్లు, స్కూళ్ల‌లో విద్యార్థుల‌కు స‌న్న‌బియ్యంతో భోజ‌నం అందిస్తున్నామ‌ని ఓ వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం గొప్ప‌గా చెబుతోంది. కానీ.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కొన్నిచోట్ల భిన్న‌మైన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. స‌న్న‌బియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అందులోనూ ముక్కిపోయిన‌ బియ్యంతోనే అన్నం వండుతున్నట్లు అక్ష‌ర‌శ‌క్తి ప‌త్రిక క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో తేలింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ పరిధిలోని అనంతరం మోడల్ స్కూల్‌లో దొడ్డు బియ్యంతో వండిన అన్నం పిల్ల‌ల‌కు పెడుతున్నారు. సన్నబియ్యం స్థానంలో దొడ్డు బియ్యం ఎలా వ‌చ్చాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌గా మిగిలిపోతోంది. అనంతారం మోడల్ పబ్లిక్ స్కూల్‌లో గతకొద్ది కాలంగా మధ్యాహ్నం భోజనం పట్ల స్కూల్ నిర్వాహ‌కుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. దొడ్డు బియ్యం.. అందులోనూ ముక్కిన పాత బియ్యం కలిపి వండిన భోజనమే పిల్లలకు పెడుతున్నారు పిల్లలు త‌మ‌ తల్లిదండ్రులకు చెప్పుకోలేక, హెడ్ మాస్టర్‌కు చెప్పుకునే దైర్యం లేక విధిలేని పరిస్థితుల్లో తింటున్నారు. దొడ్డు బియ్యం పై హెడ్ మాస్టర్ స్పష్టమైన సమాధానం ఇవ్వ‌డం లేదు. అధికారులు స్పందించి, దొడ్డు బియ్యం స‌ర‌ఫ‌రాపై చర్యలు తీసుకొని పిల్లలకు సన్న బియ్యం భోజనం సమకూర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

  • పొంత‌న‌లేని స‌మాధానాలు
    దొడ్డు బియ్యంపై సంబంధిత అధికారుల‌ను వివ‌ర‌ణ కోర‌గా పొంత‌న లేని స‌మాధానాలు చెబుతున్నారు. గోదాం నుంచి వ‌చ్చిన బియ్యంతోనే అన్నం వండుతున్నామని మోడ‌ల్ స్కూల్‌ ప్రిన్సిపాల్ చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో దొడ్డు బియ్యం వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని గోదాంకు చెబుతామ‌ని ప్ర‌య‌త్నం చేస్తే.. ఫోన్ లిఫ్ట్ చేయ‌డంలేద‌ని ఎంఈవో అంటున్నారు. ఇక గోదా నుంచి స‌న్న‌బియ్య‌మే పంపుతున్నామ‌ని గోదాం ఇన్‌చార్జి స్ప‌ష్టం చేస్తున్నారు.
  • అప‌రిశుభ్రంగా ప‌రిస‌రాలు
    విద్యార్థులు ఎండలో నిలబడి భోజనం చేస్తున్నారు. ప‌రిస‌రాలు అప‌రిశుభ్రంగా ఉన్నాయి. కోడిగుడ్ల పొట్టు రోజుల‌కొద్దీ అలాగే ఉండిపోయింది. అక్క‌డే నిల‌బ‌డి విద్యార్థులు భోజ‌నం చేస్తున్నారు. భోజన సమయంలో కోతులు పిల్లల పైకి ఎగబడుతున్నాయి. స్కూల్ నిర్వాహ‌కుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతోంది.
  • గోదాం నుంచే వ‌చ్చాయి..
    -అమరావతి, హెచ్ఏం
    మాకు గోదాం నుంచి వ‌చ్చిన బియ్యంతోనే అన్నం వండిస్తున్నాం. మా తప్పు లేదు.
  • ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేదు..
    – ఏంఈవో పూల్ సింగ్
    దొడ్డు బియ్యం వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని గోదాంకు చెప్ప‌డానికి అనేక‌సార్లు ప్ర‌య‌త్నం చేశాం. కానీ, ఫోన్ లిఫ్ట్ చేయ‌డం లేదు.
  • స‌న్న బియ్య‌మే పంపాం
    -గోదాం ఇన్‌చార్జి కోటేశ్వ‌ర్‌రావు
    మేము సన్న బియ్యమే పంపాం. కాని దొడ్డు బియ్యం ఎలా వ‌చ్చాయో తెలియ‌దు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img