Saturday, July 27, 2024

పరకాలలో బీజేపీ దూకుడు

Must Read
  • నియోజకవర్గంలో అభ్యర్థి కాళీ ప్రసాద్‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తు
  • ఉన్న‌త విద్యావంతుడిగా, ప్ర‌ముఖ వైద్యుడిగా గుర్తింపు
  • బీసీ అభ్యర్థి కావడంతో సానుకూల వాతావరణం
  • పరకాలపై ఈటల రాజేందర్ స్పెషల్ ఫోకస్..!
  • నియోజకవర్గంపై హుజురాబాద్ ఎఫెక్ట్ !

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గంగా పరకాలకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే స్థానాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఆతర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ గౌరవప్రదమైన ఓట్లను సాధించింది. ఈనేప‌థ్యంలోనే ప‌ర‌కాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన బీజేపీ అధిష్టానం ఈ ఎన్నిక‌ల్లో ఎలాగై నా విజయం సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో వ్మూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సామాజిక‌, ఆర్థిక అంశాల‌తోపాటు ప్ర‌జ‌ల‌తో ఉన్న సంబంధాల‌ను ప‌రిశీలించి ప‌ర‌కాల ఎమ్మె ల్యే అభ్య‌ర్థిగా ఐఎంఏ రాష్ట్ర అధ్య‌క్షుడు, ప్ర‌ముఖ వైద్యుడు, బీసీ వ‌ర్గానికి చెందిన డాక్ట‌ర్ ప‌గ‌డాల కాళీప్ర‌సాద్‌ను పోటీకి దింపింది. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు కాగా, డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ మున్నూరుకాపు (బీసీ) వ‌ర్గానికి చెందిన‌వారు. దీంతో బీసీ వ‌ర్గాల నుంచి కాళీప్ర‌సాద్‌కు క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. అంతేగాక‌, తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే బీసీనే ముఖ్య‌మంత్రి చేస్తామ‌న్న హైక‌మాండ్ ప్ర‌క‌ట‌న కూడా డాక్ట‌ర్ కాళీ ప్ర‌సాద్‌కు పాజిటివ్‌గా మారింది.

ఒక్కరే బీసీ..

పరకాల నియోజకవర్గంలో ముగ్గురి మధ్య నువ్వా .. నేనా.. అన్నట్లుగా పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే చ‌ల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కాళీప్రసాద్ ప్ర‌ధానంగా పోటీలో ఉన్నారు. చల్లా ధర్మారెడ్డి 2014, 18 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రస్తుతం హ్యాట్రిక్ సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ కోసమే అన్నట్లుగా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల టికెట్ తెచ్చుకున్నారు. ధర్మారెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్ద‌రూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. కాగా డాక్ట‌ర్ కాళీప్రసాద్ మాత్రం బీసీ సామాజిక వ‌ర్గానికి చెందినవారు. ఇది నియోజకవర్గంలోని బీసీ సామాజిక తరగతుల్లో చర్చకు దారి తీసింది. బీజేపీ అభ్యర్థి కాళీప్రసాద్‌కు ఎన్నిక‌ల్లో అనుకూలంగా మారనుంది.

స‌మ‌న్వ‌యంతో ముందుకు..

ప‌ర‌కాల‌లో గెలుపే ల‌క్ష్యంగా డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ ముందుకు సాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఒంటేరు జ‌య‌పాల్‌, మొలుగూరి బిక్ష‌ప‌తి, వన్నాల శ్రీరాములు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి డాక్ట‌ర్ పెస‌రు విజ‌య్‌చంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ సిరంగి సంతోష్‌తోపాటు ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల స‌హ‌కారంతో క్యాడ‌ర్‌ను స‌మన్వయం చేసుకుంటూ దూకుడుగా వెళ్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్ష‌ప‌తి అన్నీతానై ప్ర‌చారాన్ని ముందుకు న‌డుపుతున్నారు. ప్రతి మండలానికి ఇన్చార్జిలను నియమించగా వారు ప్ర‌చార కార్యక్రమాల‌ను హోరెత్తిస్తున్నారు. డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మమేకం అవుతూ బీజేపీకి ఒక్క అవ‌కాశం ఇవ్వాలంటూ అభ్య‌ర్థిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్య‌ర్థిలిద్ద‌రూ రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన బ‌డా కాంట్రాక్ట‌ర్లే అని, వాళ్ల‌తో త‌ల‌ప‌డుతున్న బీసీ బిడ్డ‌నైన త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని బీసీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈనేప‌థ్యంలోనే ఆయా గ్రామాల్లో కాళీ ప్ర‌సాద్ ప్ర‌చారానికి ప్ర‌జ‌ల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ముఖ్యంగా బీసీ వ‌ర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. దీంతో ప‌ర‌కాల గ‌డ్డ‌పై ఈసారి కాషాయ‌జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని పార్టీ శ్రేణులు కూడా ధీమాగా ఉన్నాయి.

ప‌ర‌కాల‌పై ఈటల ఎఫెక్ట్..

బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఈట‌ల రాజేందర్ పరకాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని ఓడించడమే లక్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈట‌ల‌ను ఓడించేందుకు ఎమ్మెల్యే చల్ల‌ ధర్మారెడ్డి త‌న‌వంతుగా విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. ఈట‌ల సొంత మండ‌లం క‌మ‌లాపూర్ ఇన్‌చార్జిగా ఉన్న చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ముఖ్య నేత‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల వెంట వెళ్లకుండా క‌ట్ట‌డిచేయ‌గ‌లిగారు. బీజేపీలోకి వెళ్లిన‌వాళ్ల‌ను కూడా తిరిగి బీఆర్ఎస్‌లోకి ర‌ప్పించి ఈట‌ల‌కు స‌వాల్ విసిరారు. ఈట‌ల రాజేందర్ అనుచరులను డబ్బుతో కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశార‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అంతేగాక ప్ర‌చారంలో ఈట‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డిపై ఈ ఎన్నిక‌ల్లో ఈట‌ల రాజేంద‌ర్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఆనుకునే పరకాల ఉండ‌టంతో ఈట‌ల రాజేందర్ ప్ర‌భావం ఖ‌చ్చితంగా ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంపై ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు ధీమాగా ఉన్నారు. మ‌రోప‌క్క ఈట‌ల రాజేంద‌ర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుండ‌టంతో బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్‌కు పూర్తిస్థాయిలో అనుకూలంగా మారనుంది. తెలంగాణలో అధికారం సాధిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అధిష్టానం ప్రకటించడం కూడా డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్‌కు క‌లిసివచ్చే అంశంగా మారింది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img