- రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది హస్తం పార్టీనే..
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
- భూపాలపల్లిలో గండ్ర సత్తన్న గెలవబోతున్నారు..
- వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్
- వంద రోజుల్లోనూ హామీలు అమలు చేస్తాం..
- భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ
అక్షరశక్తి, భూపాలపల్లి : ఎన్నికల్లో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణకు పూర్తి మద్దతునిచ్చి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు ఉన్నాయ ని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, వైయస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ అన్నారు. భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొరిమి రాజ్ కుమార్, అప్పం కిషన్ కార్మికులకు దిశానిర్దేశం చేశారు. కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ… కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని, ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి కార్మికుల సమస్యలు పరిష్కరిద్దామని అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అధికార దుర్వినియోగం మితిమీరిందని, అవినీతి సొమ్ముతో సీఎం కేసీఆర్ కుటుంబంలో అహంకారం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరెస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని, ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, ఇందుకోసం గండ్ర సత్యనారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రజల్లో మార్పు కనిపిస్తుందని, ఒక్క ఓటు దెబ్బతో ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎ స్, మోసపూరిత ఎంఐఎం పార్టీలను మూడింటిని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్తన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ అన్నారు.
బీఆర్ఎస్‌కు బుద్ధిచెప్పండి.. గండ్ర
తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని, కేసీఆర్ కేబినెట్ అంతా తెలంగాణ ద్రోహలతో నిండిపోయిందనని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఏదైనా ప్రాజెక్టు గేట్లు ఊడిపోవడం కొట్టుకపోవడమో విన్నామని, కానీ, నిర్మాణం చేపట్టిన తక్కువ సమయంలో పునాదులతో సహా కదిలి పోయిన ప్రాజెక్టు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమేనని అన్నారు. ప్రాజెక్టుల పునాదులు కదిలిపోతుంటే బీఆరెస్ నేతల ఫామ్ హౌజ్‌లు కమిషన్లతో దోచుకున్న డబ్బులతో నిండిపోతున్నాయని ఆరోపించారు.
దళిత బంధు, రైతురుణమాఫీ పేరుతో అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీపీఎం, టీజేఎస్, వైఎస్సార్టీపీ మద్దతు ప్రకటించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తుందని గండ్ర హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, టీపీసీసీ సభ్యుడు చల్లూరి మధు, మాజీ టీపీసీసీ సభ్యుడు చల్లూరి సమ్మయ్య, జిల్లా నాయకుడు బుర్ర కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, పట్టణ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, కురిమిళ్ళ శ్రీనివాస్, ఉడుత సరోజన రాజమల్లు, ముఖ్య నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొరిమి సుగుణతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.