- స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి
ఇందిరకు పెరుగుతున్న మద్దతు - ఊరూరా మహిళ అభ్యర్థికి బ్రహ్మరథం
- గత ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు గట్టి పోటీ..
- ఈసారి కలిసిరానున్న సానుభూతి..
అక్షరశక్తి, వరంగల్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో కదనోత్సాహం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా స్టేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావాలని హస్తం శ్రేణులు పట్టుదలతో ముందుకుసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం ఘన్‌పూర్ నియోజకవర్గంపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర ప్రచారానికి లభిస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనంగా మారింది. ఇందిరకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు పెరుగుతుండగా, ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్‌పై ఉన్న వ్యతిరేకత, మరోవైపు ప్రజల్లోకి దూసుకెళ్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ గెలుపునకు బాటలు వేస్తాయని శ్రేణులు ధీమాగా ఉన్నాయి. అంతేగాక, అధికార బీఆర్ఎస్ పార్టీలోని గ్రూపు రాజకీయాలతోపాటు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరకు కలిసి రానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆడబిడ్డకు అవకాశం ఇవ్వండి..
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి గట్టి పట్టుంది. ఇప్పటికీ అన్ని మండ లాల్లో బలమైన క్యాడర్, ఊరూరా పార్టీ నిర్మాణం ఉన్నది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఆరుసార్లు కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది, టీడీపీ నాలుగు సార్లు, బీఆర్ఎస్ నాలుగుసార్లు గెలుపొందాయి. గత ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇందిర 62, 822 (31.58శాతం) ఓట్లు సాధించి సత్తాచాటుకున్నారు. ఈక్రమంలోనే పార్టీకి పూర్వవైభవం తేవడంతోపాటు ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలోని నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ, అన్ని వర్గాల ప్రజలతో మమేకంఅవుతూ ముందుకు కదులుతున్నారు. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ చేసిదేంలేదని, తనను గెలిపిస్తే స్టేషన్ ఘన్‌పూర్‌ను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. అంతేగాక ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలను గడపగడపకూ చేరుస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందిర ప్రచారానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటంతో పార్టీకి మరింత అనుకూలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్‌కు అనుకూలంగా బీఆర్ఎస్ వర్గపోరు
జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఆ నేతలే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. ఒకప్పుడు వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు, ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నేతలు. అయినా ఈ ఇద్దరి మధ్య వైరం ముదిరిందే తప్ప ఇప్పటికీ తగ్గలేదు. నియోజక వర్గంలో పార్టీ కూడా వీరి మూలంగా రెండు వర్గాలుగా చీలిపోయి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని సీనియర్ నేత కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ పార్టీ టికెట్ కేటాయించడంతో అంతర్గత పోరుకు మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజయ్య అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఒకదశలో పార్టీ మారుతారన్న ప్రచారమూ జరిగింది. కాగా, కేటీఆర్ బుజ్జగింపులతోపాటు రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పదవి కట్టబెట్టడంతో కొంత మెత్తబడ్డారు. కడియం గెలుపు కోసం పనిచేస్తానని మాట కూడా ఇచ్చారు. అయితే.. పార్టీ గెలుపునకు తాను సహకరిస్తానని రాజ య్య పైకి చెప్తున్నప్పటికీ ఆయన వర్గీయులు మాత్రం క్షేత్రస్థాయిలో కడియంకు సహకరించే పరిస్థితి కని పించడంలేదు. ఇదే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఓవైపు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, మరోపక్క అధికార పార్టీలోని గ్రూపు కొట్లాటలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి కలిసిరానున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.