- ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి తీరుపై క్యాడర్‌లో అసంతృప్తి
- అందరినీ కలుపుకుపోవడంలేదనే విమర్శలు
- కలిసినడిస్తే విజయం ఖాయమని ధీమా
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : పరకాల నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న వ్యూహంతో పార్టీ అధిష్ఠానం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే రేవూరి ప్రకాశ్‌రెడ్డి రాకతో పరకాల కాంగ్రెస్‌లో నూతనోత్సాహం కనిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతోంది. అయితే.. ఇదే సమయంలో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంలో, అందరినీ కలుపుకుపోవడంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి కొంత వెనబడుతున్నారనే టాక్ పార్టీవర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ కోసం పదేళ్లుగా నియోజకవర్గంలో పనిచేస్తున్న నాయకులను సమన్వయపర్చడంలో రేవూరి శ్రద్ధ చూపడంలేదని, ఈ పరిణామాలు ఎన్నికల్లో నష్టం చేసే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన తీరుపై క్యాడర్‌లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అందరినీ కలుపుకుపోతే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అనూహ్యంగా రేవూరి రాక..
పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. నియోజకవర్గంలోని పరకాల పట్టణం, పరకాల మండలం, నడికూడ, ఆత్మకూరు, దామెర, సంగెం, గీసుగొండ, గ్రేటర్ వరంగల్‌లోని 15, 16, 17 డివిజన్లలో అనేక మంది నాయకులు ఇనగాల నాయకత్వంలో ముందుకుసాగుతున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఇనగాలకే టికెట్ వస్తుందన్న అందరూ భావించారు. కానీ, అనేక సమీకరణాల దృష్ట్యా అనూహ్యంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రావడం, పరకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందడం చకచకా జరిగిపోయాయి. అయితే, ఈ పరిణామాలపై మొదటి నుంచీ ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంత అసంతృప్తికి గురైనా.. చివరకు పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీల నుంచి కూడా రేవూరి సమక్షంలో భారీగానే చేరికలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇదే సమయంలో పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తున్న మండల, డివిజన్ నాయకులను సమన్వయపర్చడంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి వెనకబడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
కలిసినడిస్తే తిరుగేలేదు..!
పరకాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే.. ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం ఖాయమని పార్టీవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత కీలకమైన ఈ సమయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం.. పార్టీకి తీవ్రనష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్నిమండలాలు, డివిజన్ల నాయకులను, కార్యకర్తలను కొత్త, పాత అనే తేడాలేకుండా మరింత ఉత్సాహంగా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకుంటూ ముందుకు సాగితే.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అంటున్నాయి.