Tuesday, June 18, 2024

డోర్న‌క‌ల్ కాంగ్రెస్‌లో స‌మ‌రోత్సాహం

Must Read
  • పార్టీ అభ్య‌ర్థిగా రాంచంద్రునాయ‌క్ ఎంపిక‌పై పార్టీ శ్రేణుల్లో జోష్‌
  • కంచుకోట‌లో పూర్వ వైభ‌వం కోసం వ్యూహాత్మ‌క అడుగులు
  • సౌమ్యుడిగా, పార్టీకి విధేయుడిగా రాంచంద్రునాయ‌క్‌కు గుర్తింపు
  • రెడ్యాకు ధీటైన అభ్య‌ర్థి అంటూ శ్రేణుల సంబురాలు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌: ఒక‌ప్పుడు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌కు కంచుకోట‌. 1957 నుంచి 2004 దాకా ఐదు ద‌శాబ్ధాలపాటు హ‌స్తం పార్టీ ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగా ఏలిన గ‌డ్డ‌. 2009, 2018లో మిన‌హా.. అన్ని అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధించి, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌లోనే చ‌రిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ ఓట‌మెరుగ‌ని నియోజ‌క‌వ‌ర్గంగా రికార్డులకెక్కి దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. తెలంగాణ ఉద్య‌మ ప్ర‌భావం, పార్టీ ఫిరాయింపులతో కొంత బ‌ల‌హీన‌ప‌డినప్ప‌టికీ డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన పునాదులున్నాయి. సాంప్ర‌దాయ ఓటు బ్యాంక్‌తోపాటు క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ ఉంది. తెలంగాణ‌లో ఈసారి అధికారం చేజిక్కించుకోవాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్ పార్టీ డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈఎన్నిక‌ల్లో డోర్నక‌ల్‌లో కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌ని, పూర్వ వైభ‌వం సాధించాల‌నే ల‌క్ష్యంతో ముందుకుసాగుతోంది. ఈక్ర‌మంలోనే ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయ‌క్‌ను ధీటుగా ఢీకొనే బ‌ల‌మైన అభ్య‌ర్థిని ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెడ్యాకు గ‌ట్టి పోటీ ఇచ్చిన డాక్ట‌ర్ రాంచంద్రునాయ‌క్‌నే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. డోర్న‌క‌ల్ టికెట్ కోసం నెహ్రూనాయ‌క్‌, భూపాల్‌నాయ‌క్ ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ డాక్ట‌ర్ రాంచంద్రునాయ‌క్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య డోర్న‌క‌ల్ టికెట్ డాక్ట‌ర్ రాంచంద్రునాయ‌క్‌కు ద‌క్క‌డంతో పార్టీ శ్రేణులు, మ‌ద్ద‌తుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈసారి డోర్న‌క‌ల్‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఓట‌మి ఎరుగ‌ని నియోజ‌క‌వ‌ర్గంగా ఖ్యాతి..

ఎస్టీ రిజ‌ర్వ్‌డ్‌గా ఉన్న డోర్న‌క‌ల్ అసెంబ్లీ నియోక‌వ‌ర్గంలో మొత్తం ఏడు మండ‌లాలున్నాయి. డోర్న‌క‌ల్, మ‌రిపెడ‌, న‌ర్సింహుల‌పేట‌, కుర‌వి పాత‌వి కాగా, కొత్త‌గా చిన్న‌గూడూరు, దంతాల‌ప‌ల్లి, సీరోల్ ఏర్ప‌డ్డాయి.
డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన 1957 నుంచి 2004 వ‌ర‌కు వ‌రుస‌గా అసెంబ్లీకి జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ అభ్య‌ర్థులే ఘ‌న విజయం సాధిస్తూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌రుకు మొత్తం 14 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఇందులో ఏకంగా 12 ప‌ర్యాయాలు ఆపార్టీ నేత‌లే గెలుపొందడం విశేషం. 1957 నుంచి 1978 వ‌ర‌కు వ‌రుస‌గా నాలుగు సార్లు నూక‌ల రాంచంద్రారెడ్డి, 1978 నుంచి 1989 వ‌ర‌కు మూడుసార్లు రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి, 1989 నుంచి 2009 ఎన్నిక‌ల వ‌ర‌కు నాలుగుసార్లు డీఎస్ రెడ్యానాయ‌క్ గెలుపొందారు. 2009, 2018 ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఆ పార్టీ ఇక్క‌డ ఓట‌మి చ‌విచూసింది. 2009 ఎన్నిక‌ల్లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్య‌ర్థి డీఎస్ రెడ్యానాయ‌క్‌ను ఓడించి టీడీపీ నుంచి స‌త్య‌వ‌తి రాథోడ్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2014 ఎన్నిల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన స‌త్య‌వ‌తిని కాంగ్రెస్ అభ్య‌ర్థి రెడ్యా ఓడించారు. ఆ త‌ర్వాత 2018లో జ‌రిగిన ముందుస్తు ఎన్నిక‌ల్లో రెడ్యా టీఆర్ఎస్ త‌రుపున పోటీ చేసి విజ‌యంసాధించారు. రెడ్యానాయ‌క్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంద‌గా, అందులో ఐదుసార్లు కాంగ్రెస్ నుంచే ప్రాతినిధ్యం వ‌హించారు.

ఈసారి జెండా పాతుడే..

2014 ఎన్నిక‌ల్లో తొలిసారి జాటోత్ రాంచంద్రునాయ‌క్ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీచేసి 48, 384 ఓట్లు సాధించారు. రెడ్యానాయ‌క్ పార్టీని వీడిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పూర్తిగా డీలా ప‌డింది. ఓద‌శ‌లో పార్టీలో బ‌ల‌మైన నాయ‌కుడే లేకుండాపోయారు. ఈక్ర‌మంలోనే కాంగ్రెస్‌లో చేరిన రాంచంద్రునాయ‌క్‌ నియోక‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేశారు. 2018లో జ‌రిగిన ముందుస్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి డీఎస్ రెడ్యానాయ‌క్ పోటీచేయ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థిగా జాటోత్ రాంచంద్రునాయ‌క్ బ‌రిలోకి దిగి రెడ్యాకు గ‌ట్టి పోటీ ఇచ్చారు. రెడ్యానాయ‌క్ 88, 307 వేల ఓట్లు సాధించ‌గా, కాంగ్రెస్ అభ్య‌ర్థి రాంచంద్రునాయ‌క్ అనూహ్యంగా 70, 926 ఓట్లు సాధించి గెలుపు అంచుల‌దాకా వెళ్లారు. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ నిరాశ చెంద‌కుండా పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓ ప‌క్క అధికార బీఆర్ఎస్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌జాక్షేత్రంలో పోరాడుతూనే మ‌రోప‌క్క పార్టీ బ‌లోపేతంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈక్రమంలోనే పార్టీకి చేసిన సేవ‌ల‌తోపాటు ప్ర‌జ‌ల్లో ఉన్న ప‌లుకుబ‌డిని గుర్తించిన హైక‌మాండ్ మ‌రోసారి డాక్ట‌ర్ రాంచంద్రునాయ‌క్‌కే డోర్న‌క‌ల్ కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. తీవ్ర పోటీ మ‌ధ్య టికెట్ ద‌క్కించుకున్న డాక్ట‌ర్ రాంచంద్రునాయ‌క్ ఇక రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతూ, క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపుతూ క‌దులు తున్నారు. ఈఎన్నిక‌ల్లో ఎలాగైనా రెడ్యాను ఓడించి డోర్న‌క‌ల్ గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయ‌డ‌మే ల‌క్ష్యంతో అడుగులేస్తున్నారు. మ‌రోప‌క్క అధికార బీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌, ఎమ్మెల్యే రెడ్యాపై సొంత పార్టీలో నివుర‌గ‌ప్పిన నిప్పులా ఉన్న అస‌మ్మ‌తి ఈఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపున‌కు దోహ‌ద ప‌డుతాయ‌ని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

 

 

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img