- భూపాలపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు అన్నీ బ్రేకులే..!
- బీఆర్ఎస్ మెడకు చుట్టుకుంటున్న ప్రాజెక్టు అంశం
- కాంగ్రెస్‌కు అస్త్రంగా మారిన బ్యారేజ్ కుంగుబాటు
- జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు
- ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత.. ఎన్నికల ముందు ఊహించని షాకులు
- గత ఎన్నికల్లో కాళేశ్వరమే అధికార పార్టీకి ప్రచారాస్త్రం.. నేడు సభల్లో ఆపేరు ఎత్తని వైనం!
అక్షరశక్తి, భూపాలపల్లి : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గండ్ర వైఖరికి నిరసనగా ఆపార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హస్తం గూటికి చేరుకుంటుండటంతో నియోజకవర్గంలో గులాబీ దళం డీలా పడిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపణలు సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు డామేజీ కూడా ఎమ్మెల్యే గండ్ర మెడకు చుట్టుకుంటోంది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఈ అంశం ఇప్పుడు అధికార బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావిత భూపాలపల్లి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుంది. జిల్లాలోని భూపాలపల్లి, మంథని రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే బలహీనపడుతున్న బీఆర్ఎస్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు నిండా ముంచే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా సొంత పార్టీలో అసమ్మతి, నేతల వలసలు, నాయకుల సహాయ నిరాకరణతో బెంబేలెత్తుతున్న గండ్రకు మాత్రం తాజా పరిణామాలు మింగుడపడటంలేదు.
బెడిసికొట్టిన ప్రచారాస్త్రం..
2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రాజకీయ సభల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెబుతూ సీఎం కేసీఆర్ ప్రజలను ఓట్లు అడిగారు. ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన ప్రాజెక్టుగా, అతి తక్కువ సమయంలో ని ర్మాణం చేసిన కట్టడంగా గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది. నేడు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోని బీఆర్ఎస్‌కు, మరీ ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలోని పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థి తులను తెచ్చిపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగునుండగా బీఆర్ఎస్ చేపడుతున్న ఎన్నికల సభల్లో సీఎం కేసీఆర్ ఎక్కడా కాళేశ్వరం పేరు ఎత్తకపోవడం గమనార్హం. ముఖ్యంగా భూపాలపల్లి, మంథని, ములుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రాజెక్టుకు దగ్గరగా ఉండటంతో ఈ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భూములు కోల్పోయి.. బాధితులుగా మిగిలి..
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం సమయంలో స్థానికంగా రైతుల నుంచి ప్ర భుత్వం భూసేకరణ చేసింది. అయితే ప్రాజెక్టుకు సరిపడా భూములను మాత్రమే ప్రభుత్వం సేకరించింది. 20 మంది రైతులు మాత్రం ఇప్పటి వరకు పరిహారం అందక కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇంత భూమి ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించిన జిల్లా రైతాంగానికి ప్రాజెక్టుతో ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందనే వాదన ఉంది. ముఖ్యంగా మంథని, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గంలో కాళేశ్వరం నీరు రైతులకు అందే పరిస్థితి లేదు. అంతేగాక వర్షం వచ్చిందంటే ప్రాజెక్టు సమీప గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నష్టానికి కారకులెవరు..?
మొన్నటికి మొన్న జిల్లాలో భారీ వర్షాలు వచ్చి సుమారు వందకిపైగా చిన్న కుంటలు తెగిపోవడంతోపాటు మోరంచపల్లి గ్రామం మొత్తం కకావికలం అయిన సంగతి తెలిసిందే. నలుగురి ప్రాణాలు కూడా పోయాయి. ఈ సందర్బంగానే చిన్నకోడెపాక చెరువు (సుమారు 1000 ఎకరాల సాగు విస్తీర్ణం), కొత్తపల్లి ఎస్ఎం గ్రామ శివారు దోమర్లపల్లి (2500 ఎకరాల సాగు విస్తీర్ణం) చెరువుకు గండ్లు పడి తెగిపోగా ఈ భూముల్లో పంటలు వేయక పడావుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో వేలాది మంది రైతులు, వారి మీద పత్యక్షంగా ఆదారపడిన వేలాది రైతు కూలీ కుటుంబాలు పనులు కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థితిలో జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి గొలుసుకట్టు చెరువులకు ఎత్తిపోతల లింక్ ఇచ్చినట్లైతే నేడు ఈ గతి పట్టేది కాదు కదా అని జిల్లాలోని, నియోజకవర్గంలోని రైతాంగం ప్రశ్నిస్తోంది.
గండ్రకు బిగుసుకుంటున్న ఉచ్చు..
తలాపునే గోదారి పారుతున్న ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాళేశ్వరం జిల్లాలోనే ఉన్నా భూపాలపల్లి జిల్లాకు మాత్రం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగంలేదు. జిల్లాలోని రైతాంగానికి ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు అందిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితి అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అన్నదాతల నుండి వ్యతిరేకతకు కారణమైంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడం భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి మెడకు చు ట్టుకుంది. అంతేగాక మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు పలువురు పనులు చేసుకునేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. వీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు.