Tuesday, June 18, 2024

ఓరుగ‌ల్లులో హ‌స్తం హవా!

Must Read
  • ఉమ్మ‌డి జిల్లాలో 6 నుంచి 8సీట్లు గెలిచే అవ‌కాశాలు
  • ప్ర‌భుత్వానికి ఇంటెలీజెన్స్ వ‌ర్గాల స‌మాచారం
  • ప‌లువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌
  • క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో జోష్‌లో కాంగ్రెస్ శ్రేణులు
  • నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌తారాగం
  • క‌లిసిక‌ట్టుగా గెలుద్దామ‌నే దిశ‌గా అడుగులు!

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌తారాగం వినిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా ఎన్ని విభేదాలున్నా.. మెరుగైన అవ‌కాశాలున్న ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిసి గెలుద్దామ‌న్న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో పార్టీ అధిష్ఠానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా, ప్ర‌భుత్వానికి ఇంటెలిజెన్స్‌వ‌ర్గాలు అందించిన స‌మాచారం కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో ఏకంగా 6 నుంచి 8 స్థానాల్లో హ‌స్తం హవా ఉంద‌న్న విష‌యంపై బీఆర్ఎస్ అధిష్ఠానానికి స్ప‌ష్టమైన సంకేతాలు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం తెలంగాణ‌పై ఉండ‌బోద‌ని ఇటీవ‌ల బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పైపైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం కొంత ఆందోళ‌న ప‌డుతున్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో కాంగ్రెస్ మ‌ళ్లీ పూర్వ‌వైభ‌వం సంత‌రించుకుంటుంద‌న్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

సిట్టింగ్‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌..
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాలు వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, వ‌రంగ‌ల్ తూర్పు, న‌ర్సంపేట‌, మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, జ‌న‌గామ‌, భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల‌, ములుగు, వ‌ర్ధ‌న్న‌పేట‌, పాల‌కుర్తి ఉన్నాయి. ఇందులో ఒక్క ములుగులోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఉన్నారు. మిగ‌తా 11 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే.. ఇందులో ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఏకంగా పార్టీ అధిష్టానం సొంతంగా చేయించుకున్న స‌ర్వేలోనూ ఇదే విష‌యం స్ప‌ష్ట‌మైన‌ట్లు తెలుస్తోంది. భూదందాలు, బినామీపేర్ల‌పై రియ‌ల్ వ్యాపారం, సెటిల్మెంట్లపైనే ఉంటూ కేవ‌లం ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అయిన క‌ళ్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్‌, సీఎంఆర్ఎఫ్‌, రైతుబీమా చెక్కులు అందించ‌డానికే ప‌రిమితం అవుతున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్ర‌స్థాయిలో ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను గాలికివ‌దిలేసి, కేవ‌లం రెవెన్యూ, పోలీసులు, రియ‌ల్‌ద‌ళారుల‌కే మొద‌ట‌గా అపాయింట్‌మెంట్ ఇస్తూ ఎక్కువ స‌మ‌యం వారికే కేటాయిస్తున్నార‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది. అంతేగాకుండా, ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ బీఆర్ఎస్‌లో అంత‌ర్గ‌త కుమ్మ‌లాట‌లూ పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌రిస్థితి చేజారే ప్ర‌మాదం ఉంద‌న్న విష‌యం ప‌లు స‌ర్వేల్లోనూ స్ప‌ష్ట‌మైన‌ట్లు విశ్వాస‌నీయ స‌మాచారం.

6 నుంచి 8సీట్లపై కాంగ్రెస్ క‌న్ను
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా 6 నుంచి 8సీట్లు గెలుస్తామ‌న్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కొన్ని స్థానాల్లో పార్టీ బ‌లంగా ఉన్నా క్యాడ‌ర్‌కు భ‌రోసానిస్తూ న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డం, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను అనుకూలంగా మ‌ల‌చుకుని జ‌నంలోకి బ‌లంగా వెళ్లే వ్యూహ‌ర‌చ‌న చేయ‌క‌పోవ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా కనిపిస్తోంది. అయితే, ములుగులో మ‌ళ్లీ సీత‌క్క గెల‌వ‌డం ఖాయ‌మ‌ని, అలాగే, భూపాల‌ప‌ల్లి, న‌ర్సంపేట‌, జ‌న‌గామ‌, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, డోర్న‌క‌ల్‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌తోపాటు వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌వ‌క‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి విజ‌య అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయంటూ ఇంటెలీజెన్స్‌వ‌ర్గాలు బీఆర్ఎస్ అధిష్ఠానానికి నివేదించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెజార్టీ సిట్టింగ్‌ల‌కు టికెట్లు ద‌క్కే అవ‌కాశాలు లేవ‌నే టాక్ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. ఇక మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి అనుకూలంగానే ఉన్నా.. అందిపుచ్చుకునే వ్యూహ‌ర‌చ‌న కావాలంటూ కాంగ్రెస్‌ పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. ప్ర‌భుత్వంపై, సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై ఉన్న వ్య‌తిరేక‌తే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు అందిస్తుంద‌న్న ధీమా హ‌స్తం శ్రేణుల్లో బ‌లంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img