- హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఈటలపై విరుచుకుపడిన నన్నపునేని
- ఎవరినీ వదలిపెట్టబోనన్న రాజేందర్
- ఈ నేపథ్యంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి
- వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా వ్యూహం
- ప్రదీప్‌రావు చేరికతో పెరిగిన బలం
- రసవత్తరంగా మారుతున్న రాజకీయం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంపై హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారా…? వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పున కాషాయ జెండా ఎగురవేసే వ్యూహంతో వస్తున్నారా..? ఇక్కడి నుంచి పోటీ చేసే పార్టీ అభ్యర్థిని గెలిపించితీరడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారా..? అంటే.. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఔననే అంటున్నాయి. వరంగల్ తూర్పునే ఈటల రాజేందర్ ఎందుకు దృష్టి పెడుతున్నారు? సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేనిని ఓడించితీరాలన్న కసితో ఎందుకున్నారు? వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ప్రదీప్‌రావుకు ఈటల ఇచ్చిన హామీ ఏమిటి..? ఇప్పుడు ఇవే ప్రశ్నల చుట్టూ రాజకీయ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఈటలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రహస్యంగా సమావేశం కూడా నిర్వహించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
ఆనాడే చెప్పిన ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో ఈటలను ఓడించడానికి గులాబీ బాస్ కేసీఆర్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అనేక మంది ఎమ్మెల్యేలకు మండలాల ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాడు ఉప ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న మంత్రి హరీశ్‌రావు మెప్పు పొందేందుకు పలువురు ఎమ్మెల్యేలు విమర్శించాల్సిన దానికన్నా ఎక్కువగా విమర్శించారనే టాక్ అప్పట్లో వినిపించింది. దీంతో తనను ఓడించేందుకు, తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టబోనని, వారి నియోజకవర్గాల్లో వెళ్లి ప్రచారం చేస్తానని ఆనాడే ఈటల అన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నుంచి ప్రదీప్‌రావు బీజేపీలో చేరడం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ బలం పెరగడం, ఇదే క్రమంలో నియోజకవర్గంలో సామాజికవర్గం కొంత బలంగా ఉండడంతో ఈటల రాజేందర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో సహకరిస్తానంటూ ప్రదీప్‌రావుకు ఈటల భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రదీప్‌రావు రూపంలో బలమైన నేత
ప్రదీప్‌రావు లాంటి బలమైన నాయకుడి రాకతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2009ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ప్రదీప్‌రావు కొద్దిపాటి తేడా ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ నిర్మాణ సమితి స్థాపించి ఉద్యమించారు. అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. అయినా, 2014 ఎన్నికల్లో ప్రదీప్‌రావుకు టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. ఇక 2018 ఎన్నికల్లోనూ టికెట్ కోసం ప్రయత్నం చేసినా.. అనూహ్యంగా నన్నపునేని నరేందర్‌కే టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో సరైన గుర్తింపు దక్కడంలేదంటూ బీజేపీలో చేరారు. అయితే, అర్బన్ బ్యాంక్ అభివృద్ధి, జనంలో సానుభూతి ఉండడం, ఇదే సమయంలో ఈటల రాజేందర్ కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ.. పక్కా వ్యూహంతో ఉండడంతో ముందుముందు నియోజకవర్గంలో అంతుచిక్కని పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. రహస్యంగా సమావేశం నిర్వహించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.