- కాంగ్రెస్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ రవి
- పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన
- ఉమ్మడి జిల్లాతో 15ఏళ్లుగా అనుబంధం
- తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర
- అన్నివర్గాలతోనూ సత్సంబంధాలు
- ఆసక్తిరేపుతున్న వరంగల్ లోక్‌సభ రాజకీయం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వరంగల్ ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారా..? రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారా..? వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. కొద్దిరోజులుగా హరికోట్ల రవి కదలికలు రాజకీయవర్గాల్లో ఉత్కంఠరేపుతున్నాయి. ఉన్నతవిద్యావంతుడిగా, ప్రముఖ అంబేద్కరిస్టుగా, ఉద్యోగసంఘం నేతగా ఉద్యోగవర్గాలు, ప్రజాసంఘాలతోపాటు సామాన్య ప్రజల్లోనూ గుర్తింపు ఉన్న రవి.. ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులను కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లోనే వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన హరికోట్ల రవి.. తాజాగా మళ్లీ టికెట్ రేసులో ఉండడం ఓరుగల్లు రాజకీయాల్లో కీలక మలుపుగా కనిపిస్తోంది.
సామాన్య కుటుంబం నుంచి..
హరికోట్ల రవి స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన.. పట్టుదలతో చదువుకున్నారు. అనేక అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా.. ఉస్మానియాలో ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేసి ఉన్నతవిద్యావంతుడిగా ఎదిగారు. విద్యార్థి దశ నుంచే అంబేద్కర్, పూలే చైతన్య స్ఫూర్తితో ముందుకు కదిలారు. సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో సుమారు 13ఏళ్లు విధులు నిర్వర్తించారు. విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న రవికి.. వేలాదిమంది ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి వీడ్కోలు పలకడం గమనార్హం. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా మూడేళ్లుగా హన్మకొండలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం టీజీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, రిజిస్ట్రేషన్ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాతో హరికోట్ల రవికి సుమారు 15ఏళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాల ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగానూ గతంలో పనిచేశారు. ఈ క్రమంలో అన్నివర్గాల వారితో సత్సంబంధాలు ఆయనకు ఏర్పడ్డాయి.
సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా
ఉస్మానియా విద్యార్థిగా హరికోట్ల రవి సామాజిక చైతన్య కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఓ వైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సామాజిక సేవలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధానంగా చదువొక్కటే జీవితాన్ని మార్చుతుందన్న విశ్వాసంతో ఉన్న రవి.. ప్రధానంగా పేద విద్యార్థుల చదువులకు నిరంతరం తనవంతు సాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. డ్రాపౌట్స్ లేకుండా తనవంతు కృషి చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యోగవర్గాలను సమీకరించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక భూమిక పోషించారు. అంతేగాకుండా, కరోనా కష్టకాలంలోనూ వందలాది కుటుంబాలను హరికోట్ల రవి ఆదుకున్నారు. అనేక పట్టణాలు, గ్రామాలను సందర్శించి, నిత్యవసర సరుకులు అందించి అండగా నిలబడ్డారు. ఈ క్రమంలోనే యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అన్నివర్గాలతోనూ సత్సంబంధాలు ఏర్పడ్డాయి.
పార్టీ పెద్దల నుంచి సానుకూల స్పందన
నిజానికి, 2014 ఎన్నికల్లోనే వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం హరికోట్ల రవి ప్రయత్నం చేయడం గమనార్హం. తాజాగా, వచ్చే ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు హరికోట్ల రవి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రామసహాయం సరేందర్‌రెడ్డితోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, పాలకుర్తి కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని రవి కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేగాకుండా, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలను కూడా హరికోట్ల రవి కలిసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. తనకు వరంగల్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల నుంచి కూడా సానుకూల స్పందన ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, హరికోట్ల రవి రాజకీయాల్లోకి రావాలని, గెలిపించుకుంటామంటూ ఆయన ఫాలోవర్లు సోషల్‌మీడియా వేదికగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అనేక వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి.. జోరుగా ప్రచారం చేస్తున్నారు.