Saturday, July 27, 2024

ఆ హోంగార్డుకు సెల్యూట్ చేయాల్సిందే..

Must Read
  • ఉద్యోగం చిన్న‌ది.. మ‌న‌సు పెద్ద‌ది!
  • సామాజిక సేవ‌లో హోంగార్డు కృపాక‌ర్‌
  • కుటుంబంలో అన్ని శుభ‌కార్యాలు అనాథాశ్ర‌మాల్లోనే..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం :  ఉద్యోగం చిన్న‌ది… కానీ అత‌డి మ‌న‌స్సు మాత్రం పెద్ద‌ది.. రోడ్ల‌వెంట అనాథ‌లు, అభాగ్యులు, నిరాశ్రుయులు, కుటుంబం నుంచి నిరాద‌ర‌ణ‌కు గురైన వృద్దులు క‌నిపిస్తే చాలు అత‌డు చ‌లించిపోతాడు. వారిని చేర‌దీసి, భోజ‌నం పెట్టించి, అక్కున చేర్చుకుంటాడు. వారి స్థితిగ‌తులు తెలుసుకుని, ఆర్థిక‌సాయం చేసి అనాథాశ్ర‌మానికి త‌ర‌లిస్తాడు. కుటుంబ బంధాలు, మాన‌వ సంబంధాలు స‌న్న‌గిల్లుతున్న నేటి కాలంలో ఆయ‌న త‌న‌కేమీకాని అనాథ‌ల కోసం ప‌రిత‌పిస్తున్నాడు. మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌గా నిలుస్తున్నాడు. ప‌లువురికి ఆద‌ర్శంగా జీవిస్తున్నాడు. ఆయ‌నే హ‌న్మ‌కొండ ట్రాఫిక్ హోంగార్డు న‌ల్ల కృపాక‌ర్‌.. వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో హోంగార్డుగా ప‌నిచేస్తున్నాడు.

కుటుంబ భారంతో హోంగార్డుగా…

హ‌న్మ‌కొండ వ‌డ్డేప‌ల్లి ప్రాంతానికి చెందిన న‌ల్ల కృపాక‌ర్ చిన్న‌నాటి నుంచే క‌ష్టాన్ని న‌మ్ముకున్నాడు. స‌మ‌స్య‌ల‌కు ఎదురీదుతూ టెన్త్ పూర్తి చేశాడు. చ‌దువుకుంటూనే రాత్రి వేళ‌లో ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు. చ‌న్నిత‌నంలోనే పెళ్లికావ‌డంతో కుటుంబ భారం మీద‌ప‌డింది. పిల్ల‌లు పుట్టాక గూడా చ‌దువు మానేయ‌కుండా ప‌ట్టుద‌ల‌తో డిగ్రీ పూర్తి చేశాడు. పోలీస్ శాఖ‌లో చేరాల‌ని క‌లలు కన్నాడు. అయితే పేద‌రికం, ఆర్థిక స‌మ‌స్య‌లు అడ్డుప‌డ‌టంతో 2003లో హోంగార్డుగా విధుల్లో చేరాడు. హ‌న్మకొండ‌లో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న‌ప్పుడు పిడికెడు అన్నం దొరక్క అల్లాడిపోయే వారిని, రోడ్డు ప‌క్క‌న అనాథ‌లుగా ప‌డి ఉన్న‌వారిని చూసి చ‌లించిపోయాడు. కుటుంబాల నుంచి గెంటివేయ‌బ‌డి, బ‌య‌ట దిక్కులేనివారిగా రోడ్ల‌పై తిరుగుతున్న వారిని చూసి త‌ల్ల‌డిల్లిపోయారు. వారిని చేర‌దీసి, స‌ప‌ర్య‌లు చేసి, త‌న‌కున్న దాంట్లో త‌గిన ఆర్థిక‌సాయం చేసి వారిని అనాథాశ్ర‌మాల్లో చేర్పించ‌డాన్ని బాధ్య‌త‌గా తీసుకున్నాడు.

అనాథ‌ల మ‌ధ్యే వేడుక‌లు

త‌న‌కు, త‌న కుటుంబానికి సంబంధించిన ఏ శుభ‌కార్య‌మైనా, పండుగైనా, అనాథాశ్ర‌మంలోనే జ‌రుపుకునే ఆన‌వాయితీని కృపాక‌ర్ అలవ‌ర్చుకున్నారు. మాన‌సిక విక‌లాంగులు, వృద్ధాశ్ర‌మాలు, అనాథాశ్ర‌మాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మాలు చేస్తాడు. వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ నుంచి గ్రామాల‌కు వెళ్లే వారిలో బ‌స్‌చార్జీలు లేనివారిని గుర్తించి, టిఫిన్‌, భోజ‌నంపెట్టించి, బ‌స్‌చార్జీలు ఇచ్చి మ‌రీ ఇంటికి పంపుతాడు. తాను విధులు నిర్వ‌హించే ప్రాంతంలో ఎవ‌రైనా రోడ్డు దాట‌లేని ప‌రిస్థితిలో ఉంటే సహాయ‌ప‌డుతాడు. ప్ర‌తి రోజు ఎక్క‌డో ఓ చోట తాను విధులు నిర్వ‌హించే ప్రాంతంలో అన్న‌పూర్ణ భోజ‌నం కొనుగోలుచేసి, ఆ ప్రాంతంలో ఉండే అనాథ‌ల‌కు అందిస్తాడు. అంతేగాక‌, న‌గ‌రంలోని ఫంక్ష‌న్‌హాళ్ల‌లో మిగిలిన ఆహార‌ప‌దార్థాల‌ను సేక‌రించి, ప్యాక్ చేయించి ఆటోలు తిరుగుతూ రోడ్ల వెంట అనాథ‌లకు, నిరాశ్ర‌యుల‌కు అందిస్తాడు.

సేవ‌ల‌కు గుర్తింపు

హోంగార్డుగా విధులు నిర్వ‌ర్తిస్తూనే అనాథాల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందిస్తున్న కృపాక‌ర్ సేవానిర‌తిని ఉన్న‌తాధికారులు గుర్తించి అవార్డులు, రివార్డులు అందించారు. హోంగార్డు దినోత్స‌వం రోజున ఉత్త‌మ హోంగార్డుగా అవార్డు స్వీక‌రించారు. గ‌తంలో క‌లెక్టర్‌లుగా ప‌నిచేసిన వాకాటి క‌రుణ‌, ఆమ్ర‌పాలి చేతుల‌మీదుగా అవార్డులు పొందారు. అదేవిధంగా అప్ప‌టి సీసీ సుధీర్‌బాబు, ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్‌రావు కృపాక‌ర్‌ను స‌న్మానించి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. అంతేగాక అప్ప‌టి వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్‌భాస్క‌ర్ చేతుల‌మీదుగా స‌త్కారం పొందారు.

సేవ చేయ‌డంలో తృప్తి
న‌ల్ల కృపాక‌ర్‌, ట్రాఫిక్ హోంగార్డు
చాలా మందికి కోట్ల రూపాయ‌ల ఆస్తులుంటాయి. కానీ సేవ‌చేయాల‌నే ఆలోచ‌న ఉండ‌దు. అది ఉన్న వారికి స‌మ‌యం ఉండ‌దు. స‌మయం ఉన్న‌వారికి ఎవ‌రికి చేయాలో తెలియ‌దు. మ‌న‌కు వీలైనంత సేవ చేయ‌డంలో ఉన్న తృప్తి మ‌రెక్క‌డా ఉండదు. నేను ఎవ‌రికైన సేవ చేసిన రోజు భోజ‌నం చేసినంత తృప్తిగా ఉంటుంది. ప్ర‌స్తుత స‌మాజంలో అన్ని ఉండి కూడా అన్నందొర‌క‌ని అభాగ్యులు అనేక‌మంది ఉన్నారు. వారంద‌రి ఆక‌లి తీర్చ‌డం, సేవ చేయ‌డంలో ఉన్న తృప్తి మ‌రెక్క‌డా దొర‌క‌దు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img