మానుకోట జిల్లాలో అకాల వర్షంతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
పంటనష్టం అంచనా వేయడంలో వ్యవసాయశాఖ విఫలం
క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్లక్ష్య వైఖరి
కేవలం 16వందలకుపైగా ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఆందోళనలో బాధిత రైతులు
అక్షరశక్తి, మహబూబాబాద్ ప్రతినిధి : మానుకోట జిల్లాలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటనష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయశాఖ విఫలంగా చెందిందా..? క్షేత్రస్థాయిలో పరిశీలనలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందా..? పంటనంతా కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పలకరించి, భరోసా ఇవ్వడంలో బాధ్యతారహితంగా వ్యవహరించిందా..? అంటే.. క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వస్తున్న ఆవేదన నిజమనే చెబుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షంతో జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి, మొక్క జొన్న, కూరగాయలు, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
కానీ.. జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం కేవలం 1649 ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగినట్లు నివేదిక ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ఈ మూడు మండలాల్లోని గ్రామగ్రామానీ వెళ్లి, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత రైతులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి.. రైతులు ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారన్న లెక్కలు కూడా వ్యవసాయ శాఖ వద్ద సమగ్రంగా లేకపోవడం వల్లే పంటనష్టం సర్వే నివేదిక తప్పులతడకగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.
పట్టించుకోని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
వడగళ్ల వర్షంతో భూపాలపల్లి, హన్మకొండ జిల్లా పరకాల, వరంగల్ జిల్లా నర్సంపేటతోపాటు మానుకోట జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లోనూ వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కానీ, మంత్రులు మాత్రం కేవలం పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గంలోనే పర్యటించారు. రైతులతో మాట్లాడారు. కానీ.. మానుకోట జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలను మాత్రం మరిచిపోయారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి.
చివరకు సొంత జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కూడా మండలాల్లో పర్యటించి, రైతుల కష్టాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయలేదని, వారికి భరోసా ఇవ్వడంలో విఫలం చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూడూరు మండలంలో మాత్రం కలెక్టర్ పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ మూడు మండలాల రైతుల పట్ల ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత రైతులు తమకు పరిహారం అందుతుందో లేదోనని ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే తెగుళ్లు.. ఆపై వడగళ్లు!
ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఎక్కువగా మర్చి సాగు చేశారు. కానీ.. తెగుళ్లతో పంటంతా దెబ్బతిన్నది. ఈ క్రమంలోనే అకాల వర్షంతో పంటమొత్తాన్ని రైతులు కోల్పోయారు. వడగళ్ల దాటికి మిర్చి చెట్టుపై ఒక్క ఆకు కూడా మిగల్లేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 34వేల ఎకరాల పంటనష్టం జరిగినట్లు అంచనా వేశారు. అందుకే ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోనే 15వేల ఎకరాల నష్టం జరిగినట్లు చూపించారు. కానీ.. మానుకోట జిల్లా వ్యవసాయ శాఖ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన వ్యవసాయశాఖ రైతుల బాధలను పట్టించుకోలేదు.
ఒక్క గూడూరు మండంలోనే 200 ఎకరాల్లో మొక్కజొన్న, 1050 ఎకరాల్లో మర్చి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా చెబుతున్నారు. కానీ, గూడూరు, కొత్తగూడ, గంగారంలో మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలు కలిపి మొత్తం సుమారు పదివేల ఎకరాల వరకు దెబ్బతిన్నా.. కేవలం 1649 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక ఇచ్చారంటూ స్థానిక రైతు సంఘాల నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా.. జిల్లా వ్యవసాయ శాఖ వెంటనే రీ సర్వే చేయాలని కోరుతున్నారు.