Tuesday, June 18, 2024

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

Must Read
  • తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
  • ఇందులో 80శాత‌మంది కౌలుదారులే
  • రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి
  • కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి
  • పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి
  • రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి
  • రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు

ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..?

జ‌వాబు : గ‌తేడాదితోపాటు ఈడాది కూడా అధిక‌వ‌ర్షాల‌తో పంట‌న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది. న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని హైకోర్టు తీర్పు ఇచ్చిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కూ రైతుల‌కు సాయం అంద‌లేదు. మ‌రోవైపు వ‌రిపంట విష‌యంలో రాష్ట్ర‌ప్ర‌భుత్వం రైతుల‌ను గందర‌గోళం చేస్తోంది. మిర్చిపంట తెగుళ్ల‌తో పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌స్తుతం ప‌త్తికి ధ‌ర మంచిగా ఉన్నా దిగుబ‌డి బాగా త‌గ్గిపోయింది.

కేసీఆర్ ప్ర‌భుత్వం బ్యాంకు రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి చేయ‌క‌పోవ‌డం, దానివ‌ల్ల రైతుల‌కు కొత్త‌గా రుణాలు దొర‌క‌క‌పోవ‌డం, వ్య‌వ‌సాయ కుటుంబాల్లో విద్య‌తోపాటు వైద్యం ఖ‌ర్చు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో అప్పులు అమాంతంగా పెరిగిపోయి తీర్చ‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో తీవ్ర మాన‌సిక ఆందోళ‌న‌కు గురైన అనేక మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. క‌ష్ట‌కాలంలో రైతుల‌కు మ‌నోధైర్యం క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వాలు పూర్తి విఫ‌లం చెందాయి.

రైతుచుట్టూ రాజ‌కీయం చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌న్నీ కూడా రైతుల‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అన్న‌దాత‌లు దిక్కుతోచ‌ని స్థితిలో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 7500మందికిపైగా రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం 13వంద‌ల కుటుంబాల‌ను మాత్ర‌మే గుర్తించి ఆదుకున్న‌ది. మిగ‌తా కుటుంబాల‌పై ఇప్ప‌టివ‌ర‌కు క‌నీస విచార‌ణ కూడా చేయ‌లేదు. ఇది అత్యంత బాధ‌క‌రమైన విష‌యం. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా 194 జీవో ప్ర‌కారం ఆ కుటుంబాల‌ను ఆదుకోవాలి.

ప్ర‌శ్న : రైతుబంధుతో రైతులకు ఏ మేర‌కు లాభం జ‌రుగుతోంది..?

జ‌వాబు : రైతుబంధుతో రైతుల‌కు లాభం జ‌రుగుతుంద‌ని అధికార పార్టీ ప్ర‌చారం చేసుకుంటోంది. కానీ.. నిజానికి.. ఈ ప‌థ‌కంతో రైతుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంది. ఒక‌టి పంట‌ల బీమా ప‌థ‌కాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా ఎత్తివేసింది. రైతుల‌కు న‌ష్టం జ‌రిగిన‌ప్పుడు ఆదుకోవాల్సిన ఇన్‌పుట్ స‌బ్సిడీ అదించ‌డం లేదు. ఒక క్వింటా వ‌డ్లు పండించ‌డానికి రూ.2100ఖ‌ర్చు అవుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ.. మ‌ద్ద‌తు ధ‌ర రూ.1960 మాత్ర‌మే ఉంది. అంటే స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార‌సుల ప్ర‌కారం రూ.3వేల‌కుపైగా ఉండాల్సిన మ‌ద్ద‌తు ధ‌ర రూ.1960 ఉండ‌డం వ‌ల్ల ఒక క్వింటాకు వెయ్యిరూపాయ‌ల‌కుపైగా రైతులు న‌ష్ట‌పోతున్నారు.

అంటే ఎక‌రానికి మొత్తంగా రూ.20వేల నుంచి రూ.30వేలు ఒక పంట‌కు రైతులు న‌ష్ట‌పోతున్నారు. రైతుబంధు ప‌థ‌కం ఈ న‌ష్టాన్ని పూడ్చ‌లేదు. అలాగే.. ఒక క్వింటా ప‌త్తి పండించ‌డానికి ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కారం.. రూ.13వేలు ఖ‌ర్చు అవుతుంది. కానీ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన మ‌ద్ద‌తు ధ‌ర రూ.6025 మాత్ర‌మే ఉంది. అంటే.. ఒక క్వింటాకు రూ.6వేల‌కుపైగా రైతు న‌ష్ట‌పోతున్నాడు. ఎక‌రానికి ఐదు క్వాంటాళ్ల దిగుబ‌డి లెక్క‌వేసుకున్నా రూ.30వేల రూపాయ‌ల‌కుపైగా న‌ష్టం జ‌రుగుతోంది. అందుకే రైతులు నిజంగా కోరుకునేది రైతుబంధు కాదు.. మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం. అలాగే అప్పుల ఊబి నుంచి రైతుల‌ను ఆదుకునేందుకు రుణ విమోచ‌న చ‌ట్టం తీసుకురావాలి.

ప్ర‌శ్న : యాసంగిలో వ‌డ్లు పండించ‌వ‌ద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది..? అస‌లు స‌మ‌స్య ఎక్క‌డ ఉంద‌ని మీరు భావిస్తున్నారు..?

జ‌వాబు : భార‌త‌దేశంలో ఒక ఏడాదిలో పండే ధాన్యం మూడేళ్ల‌పాటు దేశ‌ప్ర‌జ‌ల‌కు స‌రిపోతుంది. మిగులు దాన్యాన్ని ఇత‌ర దేశాల‌ను ఎగుమ‌తి చేయ‌డం లేదు. ఇదే స‌మ‌యంలో దేశ‌ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు స‌రిప‌డు ప‌ప్పు దినుసులు, నూనె గింజ‌ల ఉత్ప‌త్తిలేక‌పోవ‌డం వ‌ల్ల ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటున్నాం. కానీ.. మ‌న రైతుల‌ను ఈ పంట‌ల సాగువైపు ఏనాడు కూడా ప్రోత్స‌హించ‌లేదు. అయితే.. ఒకటేసారి వ‌రిపండించే రైతులు ఇత‌ర పంట‌ల‌వైపు మ‌ళ్ల‌లేరు. ఎందుకంటే.. చెరువుల కింద, కాలువ‌ల కింద ఉన్న భూములు ఇత‌ర పంట‌ల‌కు అనుకూలం కాదు.

అలాగే.. ఎక‌రం పొలాన్ని తిరిగి చెల‌క‌గా మార్చ‌డానికి సుమారు రూ.10వేల నుంచి రూ.20వేల ఖ‌ర్చు అవుతుంది. తెలంగాణలో అధికంగా బోర్ల ద్వారానే సాగు నీరు అందుతుంది. బోర్ల ద్వారా రైతులు చెల‌క‌ల‌కు నీళ్లు క‌ట్ట‌లేరు. ఇర‌వై నాలుగు గంట‌ల క‌రెంటు కూడా రైతులు వ‌రిపండించ‌డానికి అనుకూలంగా ఉంది. వ‌రిపంట దిగుబ‌డిలో స్థిరంగా ఉంటుంది. గిట్టుబాటు ధ‌ర‌తో ప్ర‌భ‌త్వ‌మే కొనుగోలు చేస్తోంది. ఇక ఇత‌ర పంట‌ల దిగుబ‌డి పూర్తిగా త‌గ్గిపోయింది. మ‌ద్ద‌తు ధ‌ర‌కు ప్ర‌భుత్వం కొనుగోలు చేయ‌డం లేదు. వ‌రిసాగు విష‌యంలో కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌న్వ‌యంతో నిర్ణ‌యం తీసుకుని రైతులకు మేలుచేయాలి. కానీ.. స్వార్థ‌పూరిత రాజ‌కీయాల‌కు రైతుల‌ను బ‌లిచేయొద్దు.

ప్ర‌శ్న : తెలంగాణ‌లో కౌలు రైతుల ప‌రిస్థితి ఎలా ఉంది..?

జ‌వాబు : తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రైతు ఆత్మ‌హ‌త్య‌ల్లో 80శాతం మంది కౌలు రైతులే. రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌ల ప్ర‌కారమే తెలంగాణ‌లో మొత్తం 14ల‌క్ష‌ల మంది ఉన్నారు. కానీ.. వారిని గుర్తించ‌డం లేదు. దీంతో వారికి పెట్టుబ‌డి సాయం, రైతుబంధు, రైతు బీమా, పంట‌ల బీమా అమ‌లు కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కౌలురైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. భూ య‌జ‌మానికి రైతుబంధు వ‌స్తుందిగానీ.. ఆ డ‌బ్బులు పంట‌పండించే కౌలు రైతుల‌కు మాత్రం అంద‌డం లేదు. సొంత‌భూమిలో పంట‌పండించే రైతుల‌కే గిట్టుబాటు కావ‌డం లేదు.. ఇక కౌలు రైతుల‌కు అద‌న‌పు భారం. దీంతో యేటికేడు ఆర్థిక సంక్షోభం చిక్కుకుపోతున్నారు.

2011 కౌలుదారుల గుర్తింపు చ‌ట్టం అమ‌లు కావ‌డం లేదు. ఇది అమ‌లు అయితే.. భూ య‌జ‌మానుల హ‌క్కుల‌కు ఎలాంటి న‌ష్టం వాటిల్ల‌కుండా కౌలు రైతుల‌కు లాభం జ‌రుగుతుంది. ఈ చ‌ట్టం వ‌చ్చిన మొద‌ట్లో ఉమ్మ‌డివ‌రంగ‌ల్ జిల్లాల్లో 30వేల మంది రైతుల‌కుపైగా గుర్తింపుకార్డులు ఇవ్వ‌డం జ‌రిగింది. బ్యాంకు రుణాలు ల‌భించాయి. కానీ.. సొంత‌రాష్ట్రంలో దానిని అమ‌లు చేయ‌కుండా.. కౌలు రైతుల‌కు తీవ్ర అన్యాయం చేస్తోంది ప్ర‌భుత్వం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img