Saturday, July 27, 2024

రైతుల‌కు కేసీఆర్ షాక్‌

Must Read

ప్ర‌భుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్లు అమ్మిన రైతులు
రెండు నెల‌లు కావొస్తున్నా అంద‌ని డ‌బ్బులు
క‌నీసం ర‌శీదులు కూడా ఇవ్వ‌ని నిర్వాహ‌కులు
బ‌య్యారం మండ‌లంలో మ‌రింత అధ్వానం
మానుకోట జిల్లాలో వంద‌లాదిమంది బాధితులు
చేతిలో డ‌బ్బులు లేక నిలిచిన యాసంగి ప‌నులు
ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : రైతు పండించిన ప్ర‌తీ గింజా కొన్నామ‌ని, వెంట‌నే డ‌బ్బులు ఇస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది. మానుకోట జిల్లాలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్లు అమ్మిన రైతులు.. స‌కాలంలో డ‌బ్బులు అంద‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ధాన్యం అమ్మి రెండు నెల‌లు కావొస్తున్నా.. పైస‌లు ఇవ్వ‌డం లేద‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు.

కోత‌కూళ్లు, కూలీల‌కు అప్పు తెచ్చి ఇచ్చామ‌ని, వ‌డ్డీల‌కు వ‌డ్డీలు పెరిగిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ‌య్యారం మండల సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన 11 కొనుగోలు కేంద్రాల్లో 1840 మంది రైతులు వడ్లు అమ్మారు. వీరికి మొత్తం 18కోట్ల 17ల‌క్ష‌ల 63వేల రూపాయ‌లు రావ‌ల‌సి ఉంది. ఇప్పటి వరకు కేవ‌లం 230 మంది రైతులకు రూ.3కోట్లు మాత్ర‌మే ఖాతాల్లో జ‌మ అయ్యాయి. మిగిలిన రైతుల‌కు ఇంత‌వ‌ర‌కూ డ‌బ్బులు రాలేదు. దీంతో ఎవ‌రిని అడ‌గాలో, ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.

ఆ గ్రామాల్లో డ‌బ్బులే రాలేదు..

బ‌య్యారం మండ‌లం విన‌బాబున‌గ‌ర్‌లో పీఏసీఎస్ ఆధ్వ‌ర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో గౌరారం, ఇన‌బాబున‌గ‌ర్‌, గొర్మిళ్ల‌, కోడిపుంజుల తండాకు చెందిన 235మంది రైతులు 24420 బ‌స్తాల(9760 క్వింటాళ్లు) వ‌డ్లు అమ్మారు. ఇందులో ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 30మంది రైతుల‌కు మాత్ర‌మే డ‌బ్బులు వ‌చ్చాయి. మిగ‌తా 205మందికి డ‌బ్బులు రాలేదు. వ‌డ్లు సుమారు 45రోజులు కావొస్తున్నా.. త‌మ ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ కాలేద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇక గూడూరు మండ‌లం పొనుగోడు ఐకేపీ సెంట‌ర్‌లో 4500 క్వింటాళ్లు వ‌డ్లు కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 42మందికి మాత్ర‌మే డ‌బ్బులు వ‌చ్చాయి.. ఇంకా 72మందికి డ‌బ్బులు రావాలి. గూడూరు సొసైటీ కొనుగోలు కేంద్రంలో 4435 బ‌స్తాల వ‌డ్లు కొనుగోలు చేశారు. 415మంది రైతులకు గాను ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 197మందికి డ‌బ్బులు వ‌చ్చాయి. 218మందికి డ‌బ్బులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బుల్లేవ్‌!

స‌కాలంలో డ‌బ్బులు రాక‌పోవ‌డానికి అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహ‌కులు అనేక కార‌ణాలు చెబుతున్నార‌ని రైతులు వాపోతున్నారు. ప్ర‌భుత్వం వ‌ద్ద డ‌బ్బుల్లేవ‌ని కొంద‌రు అంటే.. మిల్ల‌ర్ల నుంచి ఆర్వో రాన‌ప్పుడు తామెలా ఇస్తామ‌ని మ‌రికొంద‌రు నిర్వాహ‌కులు ఎదురు ప్ర‌శ్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు లోపం ఎక్క‌డ జ‌రుగుతుందో.. తెలియ‌క అరిగోస ప‌డుతున్నారు. దీంతో చేతిలో పైస‌లు లేక‌ యాసంగి ప‌నులు ఆగిపోయాయ‌ని చెబుతున్నారు. అంతేగాకుండా.. కోత‌మిష‌న్, ట్రాక్ట‌ర్ కిరాయిలు, మందుల షాపుల వాళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతున్నారు.

70 క్వింటాళ్లు అమ్మిన‌

– దేవనబోయిన వీరన్న, గౌరారం
సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో 70 క్వింటాళ్ల వ‌డ్లు అమ్మిన‌. రెండు నెలలు కావొస్తోంది. ఇంత‌వ‌ర‌కు డ‌బ్బులు రాలేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. కలెక్టర్ వెంటనే స్పందించి డబ్బులు ఇప్పించేవిధంగా సాయం చేయాలి.

రెండు నెల‌లు అయితంది..

– కోడి రవి, గౌరారం
పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో 40 క్వింటాళ్ల వ‌డ్లు అమ్మి సుమారు రెండు నెలలు అవుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు డబ్బులు రాలేదు. ఏసంగి దున్నడం కోసం పెట్టుబడి లేదు. ట్రాక్టర్, హమాలీ వాళ్లు డబ్బులు ఇవ్వండి అని వేదిస్తున్నారు. గౌరారం ఊరు మొత్తం యాసంగి ఆగి పోయింది. వ‌డ్ల డ‌బ్బులు అడిగితే.. రేపు మాపు అంటున్నారు.

80 క్వింటాళ్లు అమ్మిన

– నాయిని రాంచందర్, గౌరారం
80క్వింటాళ్ల వ‌డ్లు అమ్మి సుమారు రెండు నెలలు పదిహేను రోజులు. ట్రాక్ షీట్ వచ్చింది.. ఆర్వో రాలేదు కాబట్టి ఆర్వో రానప్పుడు ఇవ్వలేమ‌ని ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వక పోవడం ట్రాక్టర్లు దున్నుడు కూల్లు అడుగుతున్నారు. హమాలీ కూలీ ఇవ్వమని వేదిస్తున్నారు. పెట్టుబడి పెట్టిన మందుల షాపుల‌వాళ్లు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే యాసంగి ప‌నులు మొదలు పెట్టలేదు.

ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు

– కత్తుల యాకయ్య, గౌరారం
పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో నేను 15క్వింటాళ్ల వ‌డ్లు అమ్మాను. రెండు నెలలు కావొస్తుంది.. ఇంత‌వ‌ర‌కూ డ‌బ్బులు రాలేదు. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అప్పులు తెచ్చి పెట్టుబ‌డి పెట్టి పంట పండించాం. వ‌డ్డీకివ‌డ్డీ పెరుగుతోంది. యాసంగి ప‌నులు చేయ‌డానికి డ‌బ్బులు లేవు. ఇప్ప‌టికైనా వెంట‌నే ప్ర‌భుత్వం మాకు డ‌బ్బులు ఇవ్వాలి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img