Tuesday, June 18, 2024

చిన్న‌చూపుపై కేయూ క‌న్నెర్ర‌!

Must Read
  • మ‌ళ్లీ విద్యార్థి జేఏసీ నేత‌ల పోరుబాట‌
  • స్వ‌రాష్ట్రంలో అవ‌కాశాల‌న్నీ ఓయూ విద్యార్థి నేత‌ల‌కే…
  • చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప‌లువురు.. చైర్మ‌న్ ప‌దవుల్లో అనేక‌మంది..
  • కేయూ విద్యార్థి నేత‌ల‌కు ద‌క్క‌ని క‌నీస గౌర‌వం
  • ఒక్క‌రికి కూడా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వ‌ని వైనం
  • బీఆర్ఎస్ తీవ్ర వివ‌క్ష చూపుతుందంటూ ఆవేద‌న‌
  • వ‌చ్చేఎన్నిక‌ల్లో పోటీ చేసే దిశ‌గా అడుగులు
  • ఎన్నిక‌ల ముంగిట కీల‌క ప‌రిణామాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత కీల‌క పాత్ర పోషించిన కేయూ విద్యార్థి జేఏసీ ఉద్య‌మ నేత‌లు మ‌ళ్లీ పోరుబాట ప‌డుతున్నారు. స్వ‌రాష్ట్రంలో త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్‌తో తేల్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ‌లోనే మొట్ట‌మొద‌ట‌గా జేఏసీ ఏర్పాటు చేసి, తిండితిప్ప‌లు మాని, కంటికి కునుకులేకుండా క‌ష్ట‌ప‌డిన త‌మ‌పై స్వ‌రాష్ట్రంలో బీఆర్ఎస్ దారుణ‌మైన వివ‌క్ష చూపుతుందంటూ ర‌గిలిపోతున్నారు. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిల‌బ‌డి క‌ల‌బ‌డి కేసుల పాలైన‌ త‌మ‌ను చిన్న‌చూపు చూస్తూ.. కేవ‌లం ఉస్మానియా విద్యార్థి నాయ‌కుల‌కే అవ‌కాశాల‌న్నీ ఇస్తూ చ‌ట్ట‌స‌భ‌ల్లోకి పంపిస్తూ, చైర్మ‌న్ ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క కేయూ విద్యార్థి ఉద్య‌మ నేత‌ను కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి పంప‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మైన అప్పటి విద్యార్థి జేఏసీ ఉద్య‌మ నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు ఉత్త‌ర తెలంగాణ‌లో పోటీ చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాలు బీఆర్ఎస్‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

మొద‌టి జేఏసీ కేయూ నుంచే..
తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం ఉవ్వెత్తున్న ఎగిసిప‌డుతున్న కాలం.. రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా న‌వంబ‌ర్ 29, 2009న ఉద్య‌మ నేత కేసీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు పిలుపునిచ్చిన స‌మ‌యం.. కేసీఆర్‌కు మ‌ద్దతుగా కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థి నేత‌లు క‌ద‌న‌రంగంలోకి దూకారు. న‌వంబ‌ర్ 18న‌ 12 విద్యార్థి సంఘాల‌తో తెలంగాణ‌లోనే మొట్ట‌మొద‌టిగా కేయూ జేఏసీ ఆవిర్భ‌వించింది. కేయూ జేఏసీ ఆధ్వ‌ర్యంలో న‌వంబ‌ర్ 23న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేయూలో భారీ బ‌హిరంగ నిర్వ‌హించి ఉద్య‌మ స్ఫూర్తిని ర‌గిలించారు. 2010 ఫిబ్ర‌వ‌రిలో ల‌క్ష‌లాదిమందితో పొలికేక స‌భ నిర్వ‌హించారు. ఇక అప్ప‌టి నుంచి కేయూ జేఏసీ ఆధ్వ‌ర్యంలో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. హ‌న్మ‌కొండ‌లో అప్ప‌టి సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని, అడ్డుకోవ‌డం, రాయినిగూడెం, మానుకోట, చంద్ర‌బాబు పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డం, అప్ప‌టి మంత్రులను, అప్ప‌టి టీడీపీ నేత‌ల‌ను నిల‌దీయ‌డం.. ఇలా అనేక కార్య‌క్ర‌మాల‌తో తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మంలో అత్యంత కీల‌క పాత్ర పోషించారు. ఈ క్ర‌మంలో అనేక మంది విద్యార్థి ఉద్య‌మ నేత‌ల‌పై రౌడీషీట్లు కూడా న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టికీ కొంద‌రు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఉప ఎన్నిక‌ల్లో పార్టీకి అండ‌గా…
తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ఏకైక ల‌క్ష్యంగా ప‌లుమార్లు అప్ప‌టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌ కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో రాజ‌య్య గెలుపు కోసం కేయూ విద్యార్థి ఉద్య‌మ నేత‌లు ఊరూరూ తిరిగారు. రాజ‌య్య గెలుపు కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఉప ఎన్నిక‌ల్లో విన‌య్‌భాస్క‌ర్‌, ప‌ర‌కాల ఉప ఎన్నిక‌ల్లో మొలుగూరి భిక్ష‌ప‌తి గెలుపు కోసం కేయూ జేఏసీ విద్యార్థి అహ‌ర్నిశ‌లు శ్ర‌మించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వెళ్తూ ప్ర‌జ‌ల‌ను క‌లిశారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. తెలంగాణ వ‌స్తేనే బ‌తుకులు బాగుప‌డుతాయ‌ని నిన‌దించారు. అంతేగాకుండా, వ‌రంగ‌ల్, మానుకోట పార్ల‌మెంట్ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో కేయూ విద్యార్థి జేఏసీ నాయ‌కులు ప్ర‌జాచైత‌న్య బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. ప‌ల్లెప‌ల్లెనా తెలంగాణ గొంతుక‌లై నిన‌దించారు. స్వ‌రాష్ట్ర సాధ‌న ఉద్య‌మ స్ఫూర్తిని ప్ర‌జ‌ల్లో ర‌గిలించారు. కానీ, తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత అవ‌కాశాల్లో కేయూ విద్యార్థి జేఏసీ నేత‌లు తీవ్ర వివ‌క్ష‌కు గుర‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు ఉత్త‌ర తెలంగాణ‌లో కూడా పోటీ చేసేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికీ త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ప‌లుమార్లు ర‌హ‌స్యంగా స‌మావేశాలు కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓయూ నుంచి అనేక‌మందికి అవ‌కాశాలు..
ఓయూ విద్యార్థి ఉద్య‌మ నేత‌ల‌కు బీఆర్ఎస్ పార్టీ అనేక అవ‌కాశాలు ఇచ్చింది. చ‌ట్ట స‌భ‌ల‌కు పంపించ‌డంతోపాటు.. ఇత‌ర కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది. బాల్క సుమ‌న్ ఎంపీగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. పిడ‌మ‌ర్తి ర‌వి 2014, 2018 ఎన్నిక‌ల్లో స‌త్తుప‌ల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండుసార్లు ఎస్సీ కార్పొరేష‌న్‌గా ప‌నిచేశారు. గాద‌రి కిశోర్ తుంగ‌తుర్తి ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. గెల్లు శ్రీ‌నివాస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. టూరిజం కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. బొంతు రామ్మోహ‌న్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఎర్రోళ్ల శ్రీ‌నివాస్ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం టీఎంఐడీసీ చైర్మ‌న్‌గా ఉన్నారు. గ‌తంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ డిప్యూటీ మేయ‌ర్‌గా బాబాఫసియోద్దీన్ ప‌నిచేశారు. ప్ర‌స్తుతం కార్పొరేట‌ర్‌గా ఉన్నారు. ఇక దూదిమెట్ల బాల‌రాజు గొర్రెలు, మేక‌ల పెంప‌కందారుల డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. ఈడిగ ఆంజ‌నేయులు బీసీ క‌మిష‌న్ మెంబ‌ర్‌గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం స్పోర్ట్స్ అథారిటీ చైర్మ‌న్‌గా ఉన్నారు. చిలుముల రాకేష్ టెక్నిక‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. విద్యాసాగ‌ర్ ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్ స‌భ్యుడిగా ప‌నిచేశారు. శుభ‌ప్ర‌ద్‌ప‌టేల్, కిశోర్‌ బీసీ క‌మిష‌న్ స‌భ్యులుగా కొన‌సాగుతున్నారు. మ‌న్నె క్రిశాంక్ తెలంగాణ మిన‌ర‌ల్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. జ‌గ‌న్మోహ‌న్ స్టేట్ టెక్నిక‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img