Saturday, July 27, 2024

కుడా బ‌డా మోసం !

Must Read
  • ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి
  • ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్ను
  • రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు
  • వేలాది ఎక‌రాల‌ ల్యాండ్ పూలింగ్‌కు య‌త్నం
  • రైతుల భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం
  • రోడ్డు ప‌డ‌నున్న వ‌రంగ‌ల్ శివారు గ్రామాల ప్ర‌జ‌లు
  • ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది జ‌నం
  • కుడాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రైతాంగం
  • పంట భూముల కోసం ఉద్య‌మం దిశ‌గా అడుగులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : ఆర్థిక వ‌న‌రుల కోసం కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) అడ్డ‌దారి తొక్కుతోంది. వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర శివారులోని వేలాది ఎక‌రాల ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్నేసింది. అభివృద్ధిపేరుతో ల్యాండ్ పూలింగ్‌కు పాల్ప‌డుతోంది. రైతుల సొంత భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర‌లేపుతోంది. పైపైకి మీ ఇష్ట‌పూర్వ‌కంగానే తీసుకుంటామంటూనే.. లోలోప‌ల మాత్రం.. చేయాల్సిన అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తోంది. ఇస్తారా.. ఇవ్వ‌రా..? అంటూ రైతు గొంతుక‌పై క‌త్తినూరుతోంది. అన్న‌దాత పొట్ట‌కొట్టే కుట్ర‌కు పాల్ప‌డుతోంది. రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు జ‌రిపి.. ఒక్క‌సారిగా ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో వేలాది రైతు కుటుంబాలు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోతున్నాయి. కుడా పిడుగుతో క‌ళ్ల‌ముంగిట బ‌తుకుదెరువు పోతుంటే.. ఏం చేయాలో.. ఎక్క‌డికి వెళ్లాలో.. ఎవ‌రికి చెప్పుకోవాలో..? తెలియ‌క ద‌య‌నీయ స్థితిలో బిక్కుబిక్కుమంటున్నాయి. తాము ఏమై పోతామోన‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. కుడా మోసాన్ని క‌డిగిపారేసేందుకు గొంతుక‌లు ఒక్క‌ట‌య్యే దిశ‌గా అడుగులు వేస్తున్నాయి.

రెండు మూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు

వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర శివారులో పెద్దఎత్తున భూసమీకరణకు కసరత్తు జరుగుతోంది. ల్యాండ్‌ పూలింగ్ కోసం రెండు మూడేళ్లుగా ర‌హ‌స్యంగా రైతుల భూముల్లో స‌ర్వేలు నిర్వ‌హించింది. ఎవ‌రికీ అనుమానం రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. కుడా సంగ‌తిని ప‌సిగ‌ట్టిన రైతులు అక్క‌డ‌క్క‌డ అడ్డుకున్నారు. త‌మ భూముల్లోకి వ‌చ్చి స‌ర్వేలు చేయడానికి మీరెవ‌రంటూ నిల‌దీశారు. ఇలా భూములు ఇవ్వడానికి ఒక పక్క రైతులు నిరాకరిస్తున్నా కుడా అదేం పట్టించుకోకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న భూములను రెండు నెలల కిందటే సర్వే చేయడం పూర్తి చేసింది. ఈ భూముల్లో వెంచర్లు చేసి ప్లాట్లుగా చేసి అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుందని, ఆర్థిక వ‌న‌రులు స‌మ‌కూర్చుకోవ‌చ్చున‌ని ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఈ క్ర‌మంలోనే ల్యాండ్‌ పూలింగ్‌ కింద సమీకరించబోయే భూములను సర్వే నంబర్లతో సహా ఇటీవ‌ల నోటిఫికేషన్‌ జారీ చేసింది. హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో 27 గ్రామాల్లో ఔటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510 ఎకరాల భూమి సమీకరణకు గ్రామాల్లో, ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి సమీకరించే వివ‌రాల‌ను నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములు ఇచ్చేందుకు వచ్చేవారు ఫామ్‌-2 ద్వారా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. ఈలోగా రైతులు తమ అభ్యంతరాలను తెలుపవ‌చ్చున‌ని పేర్కొంది.

ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి…

ఆర్థిక వ‌న‌రుల లేమితో కొట్టుమిట్టాడుతున్న కుడా ( కాక‌తీయ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌) .. న‌గ‌ర శివారులోని ప‌చ్చ‌ని పంట భూముల‌పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ భూములు అత్యంత విలువైన‌వి. ఒక్క ఎక‌రం భూమి కోట్లు ప‌లుకుతోంది. ఏరియాను బ‌ట్టి కోటి నుంచి సుమారు ఐదారు కోట్ల వ‌ర‌కు విలువుంది. ఆ భూముల‌పై క‌న్నేసిన కుడా.. టౌన్ ప్లానింగ్‌ అభివృద్ధి పేరుతో వాటిని స‌మీక‌రించి, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మీ ఇష్ట‌పూర్వ‌కంగా ఇస్తేనే తీసుకుంటామ‌ని పైపైకి చెబుతూనే.. త‌ప్ప‌కుండా గుంజుకునేలా ప‌క్కా ప్లాన్‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. కుడా మోసాన్ని ప‌సిగ‌ట్టిన రైతులు త‌మ భూములు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. రైతుల సొంత భూముల‌ను స‌మీక‌రించి, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డానికి కుడాకు హ‌క్కు ఎవ‌రిచ్చారంటూ రైతుల నుంచి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. మీ ఆర్థిక వ‌న‌రుల‌ను తీర్చుకోవ‌డానికి త‌మ పంట భూముల‌ను నాశ‌నం చేస్తారా..? అంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. పంట భూముల‌ను ప్లాట్లు చేస్తే.. ఇక తామేం చేయాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ప్ర‌శ్న‌ల‌కు కుడా అధికారుల వ‌ద్ద స‌రైన స‌మాధానం లేక బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ల్యాండ్ పూలింగ్ వెనుక పెద్ద కుట్ర దాగి వుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రైతుల‌కు కుడా ఏం ఇస్తుంది..?

ల్యాండ్ పూలింగ్ పేరుతో భూముల‌ను స‌మీక‌రించిన కుడా.. రైతుల‌కు భూముల ఖ‌రీదు కింద డ‌బ్బులు ఇవ్వ‌దు. ఎక‌రం భూమి తీసుకుని రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌గా డెవ‌ల‌ప్ చేస్తే.. అందులో కేవ‌లం సుమారు 1200గజాల నుంచి 1400 గ‌జాల వ‌ర‌కు రైతుకు ఇస్తుంది. మిగ‌తా భూమిని కుడా త‌న సొంతం చేసుకుని వ్యాపారం చేస్తుంది. ఇక ఆ రైతు త‌న‌కు ఇచ్చిన 1200 గ‌జాల భూమిని అమ్ముకుంటే అమ్ముకోవ‌చ్చు.. లేదంటే.. అలాగే ఉంచుకోవ‌చ్చున‌ని కుడా చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ల‌క్షాధికారులు, కోటీశ్వ‌రులు అవుతార‌ని ఆశ‌లు పుట్టిస్తున్నారు. కుడాకు నిధులు వ‌స్తే.. సిటీ డెవ‌ల‌ప్ అవుతుంద‌ని అంటున్నారు. కానీ.. ఇక్క‌డే అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పంట‌లు పండే భూమిని ప్లాట్లుగా చేసి ఇస్తే.. మ‌రి రైతులేం చేయాలి..? కూలీలేం కావాలి..? వారికి ఉపాధి ఎవ‌రు క‌ల్పిస్తారు..? ఎక్క‌డ క‌ల్పిస్తారు..? ఆ ప్లాట్ ఎన్న‌డు అమ్ముడు పోవాలి..? ఎవ‌రు కొనాలి..? కుటుంబ ఆర్థిక అవ‌స‌రాలు ఎలా తీరుతాయి..? స‌కాలంలో అమ్ముడు పోక‌పోతే.. పిల్ల‌ల చ‌దువు, వైద్య ఖ‌ర్చులు ఎవ‌రు ఇస్తారు..? ఇలా స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. త‌మ చేతుల్లో పంట భూములుంటే.. త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రాకుంటే.. వ్య‌వ‌సాయం చేసుకుని బ‌తుకుతార‌న్న భ‌రోసా ఉంటుంది.. కానీ.. భూములు లేకుంటే.. తమ ప‌రిస్థితి ఏమిటంటూ రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు..?

ద‌య‌నీయ స్థితిలో ఆ రైతులు…

ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న కొంద‌రు రైతులు త‌మ భూముల‌ను అమ్ముకునే ఆలోచ‌న‌లో ఉన్నారు. బిడ్డ‌ల వివాహాలు, పిల్ల‌ల చ‌దువులు, వైద్య ఖ‌ర్చులు, అప్పుల నేప‌థ్యంలో త‌మ భూమిలో కొంత భాగం అమ్ముకుని అవ‌స‌రాలు తీర్చుకునే క్ర‌మంలోనే.. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్‌లో స‌ర్వే నంబ‌ర్లు ఉండ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయారు. ఆ భూముల‌ను కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క బిక్కుబిక్కుమంటున్నారు. అయితే.. నోటిఫికేష‌న్‌లో పెట్టిన స‌ర్వే నంబ‌ర్ల భూముల‌ను ఎవ‌రూ కొన‌వ‌ద్ద‌ని, రిజిస్ట్రేష‌న్ చేయ‌వ‌ద్ద‌ని తాము స‌బ్‌రిజిస్ట్రార్ల‌కు లేఖ‌లు రాయ‌లేద‌ని కుడా అధికారులు చెబుతున్నారు. కానీ.. ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్‌లో ఉన్న స‌ర్వే నంబ‌ర్ల భూముల‌ను కొన‌డానికి ఎవ‌రూ సాహ‌సం చేయ‌ర‌ని, ఇప్పుడు త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని, త‌మ ఆర్థిక అవ‌స‌రాలు ఎలా తీరుతాయంటూ ప‌లువురు రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పంట భూముల కోసం ఉద్య‌మం..

త‌మ విలువైన పంట భూముల‌ను కాపాడుకోవ‌డానికి 27 గ్రామాల రైతులు ఉద్య‌మం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే.. అనేక చోట్ల నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ పంట భూముల‌ను తీసుకోవ‌ద్దంటూ అధికారులకు విన‌తిప‌త్రాలు కూడా స‌మ‌ర్పిస్తున్నారు. ఈ ఉద్య‌మాన్ని మ‌రింత ఉధృతం చేసే దిశ‌గా ముందుకు క‌దులుతున్నారు. త‌మ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా కొన్ని పార్టీలు, ప్ర‌జాసంఘాలు, మేధావులు ఇత‌ర వ‌ర్గాలు కూడా ముందుకు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img