పంటల్ని కోల్పోయిన రైతులను ఆదుకుంటాం
అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతులను ఆదుకుంటాం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పరకాల, నర్సంపేటలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన
పాల్గొన్న ఎమ్మెల్యేలు పెద్ది, చల్లా, గండ్ర, ఎంపీలు కవిత, దయాకర్
అక్షరశక్తి వరంగల్ ప్రతినిధి: నోటి కొచ్చిన మిర్చి నేలరాలిందని, రైతులు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను మంగళవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వరంగల్, మానుకోట ఎంపీలు దయాకర్, కవిత, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతిన్నదని అన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేశామని పేర్కొన్నారు.
దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది దేశంలో కేసీఆర్ సర్కారేనని మంత్రి పేర్కొన్నారు. ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎనిమిదో విడతతో రూ.50 వేల కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలకు చేరాయని ఆయన తెలిపారు. అకాలవర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్న మాట వాస్తవమేనని, నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని చెప్పారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి పరిస్థితులను తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని అన్నారు. రైతులకు సాయం చేసింది కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేశామని, మిర్చి రైతుల పరిస్థితి బాధాకరంగా ఉందని, చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.