అక్షరశక్తి, హన్మకొండ : అదేమిటోగానీ.. హడావుడిగా సీఎం కేసీఆర్ ఉమ్మడివరంగల్ జిల్లా పర్యటన ఖరారు అవుతుంది.. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఆగమాగంగా ఏర్పాట్లు మొదలు పెడుతారు. రాత్రికిరాత్రే అంతా రెడీ చేస్తారు.. సీఎం కేసీఆర్ వస్తున్నారు.. తమ కష్టాలను వింటారు.. పరిష్కారం చూపుతారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు.. తీరా చూస్తే ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.. అని వార్తలు వస్తుంటాయి.. అయ్యయ్యో.. వాయిదా పడిందా..? అంటూ నిరాశలో మునిగిపోవడం పరిపాటిగా మారిపోయింది. కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనలు వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి.
తాజాగా.. మరోసారి వాయిదా
తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన మరోసారి వాయిదా పడింది. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నట్లు సోమవారం కేబినెట్ నిర్ణయించింది. కానీ.. అనివార్య కారణాల వల్ల పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే.. నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మంగళవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించనున్నారు. పంటనష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందించనున్నారు.
గతంలో హన్మకొండ, జనగామలో
గతంలో వరంగల్ నగరంలో సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు అయింది. ఆ తర్వాత వాయిదా పడింది. జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన షెడ్యూల్ వచ్చింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు, అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. తీరా.. బ్రేకింగ్ న్యూస్… సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా..! అంటూ వార్తలు వచ్చేశాయి.. ఇలా వరుసగా మూడుసార్లు కేసీఆర్ పర్యటన వాయిదాలు పడడంపై పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలూ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
రైతుల్లో తీవ్ర నిరాశ..
అకాలవర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో మిర్చి, మొక్కజొన్న, అరటి, చిరుధాన్యాల పంటలు వందశాతం దెబ్బతిన్నాయి. కేసీఆర్ స్వయంగా వస్తున్నారన్న వార్తతో రైతులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కష్టాలను చూస్తారని, నష్టపరిహారం అందించి, తమను ఆదుకుంటారని అనుకున్నారు. కానీ.. తీరా.. సీఎం పర్యటన వాయిదా పడడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.