- మారుమూల ప్రాంతం నుంచి ఎదిగిన గిరిజన యువకుడు
- టెన్త్, ఇంటర్‌లో ఫెయిలైనా కుంగిపోని ధైర్యం
- మరింత ఆత్మవిశ్వాసంతో ముందడుగు
- ఖాళీ కడుపుతో హన్మకొండలో కూలిపని..
- ఉస్మానియా విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
- మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం
- ప్రజాచైతన్యం కోసం అనేక కార్యక్రమాలు
- జీతంలో సగానికిపైగా సమాజసేవకే…
- ఆదర్శంగా నిలుస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ కాశీరామ్
కష్టానికి కన్నీటిబొట్టు రాల్చుకుంటూ కూర్చోలేదు.. ఓటమికి చాటుగా ఉండలేదు.. చేరదీసే చేతుల కోసం ఎదురుచూడలేదు.. అడుగడుగునా కాలంతో కసిగా కలబడి నిలబడ్డాడు..వస్తే రానీ.. కష్టాల్! నష్టాల్! కోపాల్! శాపాల్! తాపాల్! అనుకుంటూ సాహసమే పూబాటగా ముందుకుసాగాడు. ఖాళీ కడుపుతో కూలి చేసి, కలగన్న గమ్యాన్ని ముద్దాడిన సాహసికుడు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా..? ఆయన మరెవరో కాదు.. మట్టిమనుషుల ముద్దుబిడ్డ, గిరిజనం గుండెచప్పుడు.. నేటి యువతకు రోల్‌మోడల్, పోలీస్ ఆఫీసర్ కాశీరామ్ బానోత్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించి, అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువుకుని ఎదిగిన తీరు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. కులం లేదు.. మతం లేదు.. నీ.. నా అనే ప్రాంతం లేదు.. మనిషిని మనిషిగా ప్రేమించే గుణధనవంతుడు. చిన్నపాటి కష్టానికి కూడా తట్టుకుని నిలబడలేక, ఓటమికి కుంగిపోతూ భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్న యువతీయువకుల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపే కాశీరామ్ లైఫ్‌స్టైల్ మీ కోసం…
– అక్షరశక్తి, హన్మకొండ క్రైం
- మారుమూల ప్రాంతం నుంచి…
కాశీరామ్ బానోత్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఏపూరు గ్రామ శివారు టేకులతండా. తల్లిదండ్రులు కాళీ- పాచ్య. కాశీరామ్‌కు ఇద్దరు అక్కలు, ఇద్దరు తమ్ముళ్లు. నిరుపేద కుటుంబం. ఇంట్లో కనీసం కరెంట్ కూడా లేని పరిస్థితులు. వానొస్తే.. ఇల్లంతా కురిసి రాత్రంతా నిద్రలేకుండా కూర్చునే దయనీయ రోజులు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించేవారు. అలాంటి పరిస్థితుల మధ్య కాశీరామ్ ఏపూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, గూడూరు హైస్కూల్‌లో పదోతరగతి, మహబూబాబాద్‌లోని విజ్ఞాన భారతి జూనియర్ కళాశాలలో ఇంటర్, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, కేయూ నుంచి ఎంకామ్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ లింగ్విస్టిక్స్, భద్రాచలంలో బీఈడీ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే కాశీరామ్ ఎంతో చురుగ్గా ఉన్నా.. అనేక ఇబ్బందుల వల్ల చదువు అంత సాఫీగా సాగలేదు. తండా నుంచి హన్మకొండకు సుతారిపనికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. బాగా చదువుకుని ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉండేవాడు. పదో తరగతిలో, ఇంటర్‌లో ఫేయిల్ అయినా మళ్లీ బాగా ప్రిపేర్ అయ్యి పాసయ్యాడు. ఈ సమయంలో ఎవరెన్ని మాటలన్నా.. చిన్నచూపు చూసినా కుంగిపోకుండా.. మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు కదిలాడు. డిగ్రీ, పీజీలో ఉత్తమ ప్రతిభకనబర్చి తండాలో అక్షరజ్యోతి వెలిగించాడు. అంతేగాకుండా, స్పోర్ట్స్‌లోనూ కాశీరామ్ ముందుంటూ.. 2009లో ఉస్మానియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాడు. - ఒక్కరు మారిన చాలు..
2009లో మొదటి ప్రయత్నంలో ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో టౌన్‌లో ఆరేళ్లు పనిచేశారు. వరంగల్ కమిషనరేట్‌లోని సీటీసీలో ఏడాది పనిచేశారు. పదోన్నతిపై వరంగల్ మామునూరు పీటీసీలో రిజర్వుడ్ ఇన్‌స్పెక్టర్(సీఐ) పనిచేస్తున్నారు. అయితే.. చిన్నతనం నుంచే కాశీరామ్ అనేక బాధలను అనుభవించారు. సారాతో కుటుంబాలు ఎలా ఛిద్రమైపోతాయో దగ్గర నుంచి చూసిన ఆయన.. మద్యం మహమ్మారిని తరిమికొట్టాలని నిర్ణయించుకున్నాడు. మద్యం ముట్టొద్దని ఆనాడే ప్రతినబూనాడు. అంతేగాకుండా, మూఢనమ్మకాలు, భ్రూణ హత్యలు, మంత్రాలతో ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే.. తన చుట్టూ ఉన్న మనుషులను మంచిమార్గంలో నడిపించే ప్రయత్నం మొదలు పెట్టాడు. బిడ్డా.. నువ్వు చెబితే ఎవ్వరూ వినరు.. ఎందుకురా.. ఇవ్వన్నీ నీకు.. అని అమ్మ అన్నప్పుడల్లా.. వందలో ఒక్కరు మారిన చాలు.. అంటూ చిరునవ్వుతో కాశీరామ్ సమాధానం చెప్పేవాడని స్థానికులు అంటున్నారు. ఇలా, 2007 నుంచి ఒక్కరు మారిన చాలు.. అన్న నినాదంతో స్నేహితులతో కలిసి అనేక ప్రజా చైతన్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తనకొచ్చే జీతంలో సగానికిపైగా సేవకే కేటాయిస్తున్నారు. - సవ్యసాచి
విద్యార్థి దశలోనే నాయతక్వ లక్షణాలు సంపాదించుకున్న కాశీరామ్ సవ్యసాచిగా గుర్తింపు పొందారు. నిత్యం సాహిత్య అధ్యయనం ఆయన సొంతం. ఆటల్లో, పాటల్లో, మాటల్లో తనదైన ముద్రవేశారు. ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తనపాటలతో అందరినీ మెప్పించారు. అంతేగాకుండా, మంచి వక్తగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మాటలు వింటే.. పిరికితనం పారిపోయి ఆత్మవిశ్వాసం వస్తుందని, ఆయన ఉపన్యాసం వింటే.. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూలతను వెతుక్కోవడం తెలుస్తుందని.. స్నేహితులు, అనుచరులు అంటుంటారు. ఈ నేపథ్యంలోనే యూత్‌లో కాశీరామ్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎంతో స్టైలిష్‌గా ఉండే కాశీరామ్‌కు పలుమార్లు సినిమా, మోడలింగ్ అవకాశాలు వచ్చినా రంగుల ప్రపంచాన్ని వదులుకుని.. తాను కలగన్న మనిషిని మనిషిగా ప్రేమించే సమాజం కోసం అడుగులు వేస్తున్నారు.