Tuesday, June 18, 2024

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

Must Read
  • బీజేపీలో చేరితే రాజ‌కీయంగా
    ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు
  • హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..!
  • మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ?

బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు…? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో ఈ ఇద్దరి నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోంది…? అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డిబేట్‌గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. దీంతో ఈ ఇద్దరు నేతల క‌ద‌లిక‌లు ఎలా ఉండబోతున్నాయి అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పొంగులేటిని చేర్చుకోవాలని, త‌ద్వారా ఖ‌మ్మంలో ఉనికి చాటుకోవాల‌ని బీజేపీ తెగ ప్రయత్నం చేస్తుంది. అస‌లు ఉనికే లేని ఖ‌మ్మంజిల్లాలో ఆర్థిక వ‌న‌రులు పుష్క‌లంగా ఉండ‌టంతోపాటు జ‌నాద‌ర‌ణ గ‌ల నేత‌గా ఉన్న పొంగులేటి చేరిక‌తో ఎంతో కొంత లాభ‌ప‌డొచ్చ‌ని క‌మలం నేత‌లు లెక్క‌లేసుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏ మాత్రం బలంలేని బీజేపీలో చేరడం అమాయకత్వం అవు తుందనే ఆలోచనతో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా తన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆయ‌న ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెల‌లే గ‌డువు ఉండ‌టంతో ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల ప్రాభ‌ల్యం బ‌లంగా ఉన్న ఖ‌మ్మం జిల్లాలో బీజేపీని బలీయమైన శక్తిగా మార్చడం అంటే ఆషామాషీ కాదని పొంగులేటి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఖ‌మ్మం ఉమ్మ‌డి జిల్లాలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరితేనే బెటర్ అనే తలంపుతో పొంగులేటి ఉన్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో చేరాలనే సూత్రప్రాయ నిర్ణయానికి పొంగులేటి వచ్చారని ఆయన అనుచరులు కూడా ఇందుకు జైకొట్టారని తెలుస్తోంది. వెంట‌నే నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డ‌కుండా మ‌రి కొద్దిరోజులు వేచి చూసి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పార్టీలో చేరేలా ప్లాన్ రెడీ చేసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రస్తుత బీజేపీ నేత డీకే అరుణ ఒకప్పుడు కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అప్పడు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ మధ్య వర్గపోరు నడిచింది. దీంతో ఇప్పుడు జూపల్లి పార్టీలోకి వస్తే మళ్లీ ఇవే పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయని జూప‌ల్లి వర్గం అభిప్రాయపడుతోంది. జూపల్లి కూడా ఇంత వరకూ బీజేపీవైపు దృష్టి సారించలేదు. ఈక్ర‌మంలోనే ఆయ‌న కాంగ్రెస్‌లో చేరిక‌కు సుముఖంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రు త‌మ‌కు కాంగ్రెస్ పార్టీయే సేఫ్ అన్న ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img