వేలకోట్ల రూపాయల మోసం
కుంభకోణంలో అక్షర, అచల, భవితశ్రీ, శుభనందిని, కనకదుర్గ సంస్థలు?
ఖాతాదారులను నిలువునా ముంచుతున్న వైనం
నెలలు గడిచినా అందని డబ్బులు
బాధితుల ఫిర్యాదుపై స్పందించిన సీపీ తరుణ్‌జోషి
ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ?
చిట్‌ఫండ్స్ మోసాలపై అక్షరశక్తి సంచలన కథనాలు
అక్షరశక్తి, వరంగల్ ప్రతినిధి : ఓరుగల్లులో చిట్‌ఫండ్స్ కంపెనీలు వేలకోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డాయా..? ఖాతాదారుల సొమ్మునంతా పక్కదారి పట్టించాయా..? అందుకే చిట్టీ ఎత్తుకుని నెలలు, ఏడాది గడిచినా డబ్బులు ఇవ్వడం లేదా..? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు ఔననే అంటున్నాయి. ప్రధానంగా అక్షర, అచల, భవితశ్రీ, శుభనందిని, కనకదుర్గ చిట్‌ఫండ్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలకాలంలో పలు సంస్థల మోసాలపై పక్కా ఆధారాలతో అక్షరశక్తి పత్రికలో సంచలన కథనాలు ప్రచురితమయ్యాయి.
ఖాతాదారుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. బాధితుల పక్షాన నిలబడింది. ఈ క్రమంలోనే పలువురు బాధితులు నేరుగా వరంగల్ సీపీ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సీపీ తరుణ్‌జోషి విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ముగ్గురు చిట్‌ఫండ్స్ సంస్థల నిర్వాహలకును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఓరుగల్లులో హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి.
సిండికేట్ ఛీటింగ్
ఓరుగల్లులో చిట్‌ఫండ్స్ సంస్థల పేర్లు వేరైనప్పటికీ.. ఎజెండా మాత్రం ఒక్కటే. అదే కస్టమర్లను మోసం చేయడం. ఏజెంట్లను పెట్టి చిట్టీలు వసూలు చేయించడం, ఎత్తుకున్న చిట్టీకి సొమ్ము ఇవ్వకుండా.. పనికిరాని ప్లాట్లను అంటగడుతూ సింగికేట్‌గా ఛీటింగ్‌కు పాల్పడుతున్నాయి. ఇక కష్టపడి.. రూపాయిరూపాయి కూడబెట్టి.. ఎంతో నమ్మకంతో చిట్‌ఫండ్స్‌ను ఆశ్రయిస్తున్న ఖాతాదారులను సంస్థలు నిండా ముంచుతున్నాయి. నెలనెలా క్రమం తప్పకుండా చిట్టీ కట్టి.. అవసరానికి, ఆపదలో ఎత్తుకున్న తర్వాత.. సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి.
చిట్టీ ఎత్తుకుని నెలలు గడిచినా ఖాతాదారులకు ఆఫీస్‌ల చుట్టూ తిప్పుకుంటున్నాయి. రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నాయి. చివరకు చెల్లని చెక్కులను ఇచ్చి మోసాలక పాల్పడుతున్నాయి.. ఇలా ఖాతాదారుల నుంచి వేలకోట్ల రూపాయలు వసూలు చేసి, వాటిని తమ స్వార్థ ప్రయోజనాల కోసం రియల్‌రంగంలో, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆపదలో డబ్బులు అందక ఖాతాదారులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. నమ్ముకున్న సంస్థలు మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇటీవల కాజీపేట శుభనందిని బ్రాంచ్‌లోనూ ఓ ఖాతాదారుడు కుటుంబంతో సహా వచ్చి ఆందోళన చేశాడు.
కస్టమర్ల సొమ్ముతో జల్సాలు
ఖాతాదారుల సొమ్ముతో పలువురు చిట్‌ఫండ్స్ సంస్థల నిర్వాహకులు ఫుల్‌గా జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లోని పబ్బుల్లో వీకెండ్ పార్టీలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఇలా ఖాతాదారుల కష్టాలను పట్టించుకోకుండా, వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా, ఇష్టారాజ్యంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పలు చిట్‌ఫండ్స్ సంస్థల యాజమానులు పలువురు రాజకీయ నాయకులకు బినామీలుగా వ్యవహరిస్తన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కుమ్మక్కుగా నగరశివార్లలో రియల్ వెంచర్లు చేసి, తక్కువ ధరలో ఉన్న భూములను కస్టమర్లకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా అనేకమంది ఖాతాదారులు మోసపోయి ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ధైర్యం చేసి అడుగుదామంటే.. నిర్వాహకుల వెనుక రాజకీయ పలుకుబడి ఉందని తెలియడంతో అనేక మంది సైలెంట్‌గా ఉండిపోతున్నారు.