- స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే దిశగా అడుగులు
- నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు
- సామాజిక సేవా కార్యక్రమాలతో జనంలోకి..
- పార్టీ శ్రేణుల్లో పట్టుకోసం ప్రయత్నాలు
- స్థానికత కలిసివస్తుందన్న ధీమా
అక్షరశక్తి, స్టేషన్‌ఘన్‌పూర్ : కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నారా..? జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? ఇందులో భాగంగానే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారా…? పార్టీ అధిష్ఠానం కూడా తనకు అండగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారా..? అంటే నియోజకవర్గంలో తాజాగా కనిపిస్తున్న ఆయన కదలికలు ఔననే అంటున్నాయి. రఘునాథపల్లి మండలం కోమళ్లకు చెందిన డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ ప్రస్తుతం జనగామతోపాటు స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కొనసాగుతున్నారు. అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా.. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గ నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
- స్థానికుడిగా కలిసివస్తుందంటూ..
తాను స్థానికుడినని, ఒక డాక్టర్‌గా నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడినని, ఇవన్నీ తనకు కలిసివచ్చే అంశాలన్న ధీమాలో డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ ఉన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి తనంతు సాయం అందిస్తూ కాంగ్రస్ పార్టీతోపాటు ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. తెలంగాణలోనూ అవే ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఇదే అదనుగా జనంలోకి మరింత వేగంగా వెళ్లేందుకు డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘనపురం, జఫర్‌ఘడ్, రఘునాథ్‌పల్లి, చిలుపూర్, వేలేరు మండలాల్లో తన అనుచరగణాన్ని తయారు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల వచ్చే ఎన్నికల్లో డాక్టర్ బొల్లెపల్లి కృష్ణకే టికెట్ ఇవ్వాలన్న నినాదాలూ వినిపిస్తున్నాయి. - ఇందిరను కాదని ఇస్తారా..?
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇందిర కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై ఓడిపోయారు. అయితే.. ఎన్నికల తర్వాత నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు ఆమె నిత్యం అందుబాటులో ఉండడం లేదని, ఏదైనా కార్యక్రమం ఉంటేనే హైదరాబాద్ నుంచి వచ్చిపోతున్నారనే అసంతృస్తి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. ఇక్కడే ఉండి కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంలేదనే విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఉండి తమను పట్టించుకునే నాయకులు కావాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. ఇదే అంశం తనకు కలిసివస్తుందన్న నమ్మకంతో డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ ఉన్నారు. కానీ.. పార్టీ అధిష్ఠానం వద్ద ఇందిరకు మంచి గుర్తింపు ఉండడంతో ఆమెను కాదని డాక్టర్ బొల్లెపల్లి కృష్ణకు ఇస్తారా..? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే మరి.