Saturday, July 27, 2024

గూడు కోసం పోరుబాట‌

Must Read
  • సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో భూపోరాటాలు
  • గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌లోని ప్ర‌భుత్వ భూముల్లో ఎర్రజెండాలు
  • వంద‌లాది ఎక‌రాల్లో వెలుస్తున్న వేలాది గుడిసెలు
  • పేద‌ల‌కు అండ‌గా వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు
  • ఇండ్ల స్థ‌లాలు సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు
  • కేసుల న‌మోద‌వుతున్నా భ‌య‌ప‌డ‌ని వైనం..

అనేక ఉద్య‌మాల‌కు ఊపిరూలూదిన ఓరుగ‌ల్లు గ‌డ్డమీద గూడు కోసం పేద‌లు పోరుబాట ప‌డుతున్నారు. న‌గ‌రంలో నిలువ నీడ కోసం గ‌ళ‌మెత్తుతున్నారు. కూటి కోసం.. కూలి కోసం.. పొట్ట చేత‌ప‌ట్టుకుని పట్ట‌ణంలో బ‌తుకుదామ‌ని వ‌చ్చిన‌ నిరుపేద‌ల‌కు క‌మ్యూనిస్టు పార్టీలు అండ‌గా ఉంటున్నాయి. సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వ‌ర్యంలో పేద‌ల ఇంటి జాగ కోసం భూపోరాటానికి నాంది ప‌లుకుతున్నాయి. ఈక్ర‌మంలోనే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని వంద‌లాది ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల్లో ఎర్ర‌జెండాల నీడ‌న గుడెసెలు వెలుస్తున్నాయి. ప్ర‌భుత్వం నుంచి అధికారుల నుంచి నిత్యం కేసులు, బెదిరింపులు, వేధింపులు వ‌స్తున్న‌ప్ప‌టికీ పిడికిలెత్తి పోరాటాన్ని మున్ముందుకు తీసుకెళ్తున్నాయి. గ‌తంలోనూ ప్ర‌భుత్వాల‌తో కొట్లాడి.. క‌మ్యూనిస్టు పార్టీలు పేద‌లకు ఇండ్ల జాగ‌ను సాధించిన విష‌యం తెలిసిందే.

నిలువ‌నీడ లేని పేద‌లు..

గ్రామాల్లో వ్య‌వ‌సాయం దెబ్బ‌తిని, ఉపాధి క‌రువై.. చేతిలో ప‌నిలేక పొట్ట చేత‌ప‌ట్టుకుని ప‌ట్ట‌ణాల‌కు నిత్యం పేద‌లు వ‌ల‌స‌లు వ‌స్తూనే ఉన్నారు. వ‌రంగ‌ల్ మ‌హానగ‌రంలో వారికి నిలువ నీడ లేక దుర్బ‌ర జీవితాలు గడుపుతున్నారు. ఎక్కువ‌గా క‌నీస సౌక‌ర్యాలు లేని ఇరుకైన గ‌దుల్లో కొంద‌రు అద్దెకు ఉంటుండ‌గా, మ‌రికొంద‌రు డ్రైనేజీల వెంట‌, అట్ట‌ముక్కులు, చీకిపోయిన చీరెలు, ఇరిగిపోయిన రేకుల‌తో చిన్న‌చిన్న గుడిసెలు వేసుకుని కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఈనేపథ్యంలో వారికి సీపీఐ, సీపీఎం పార్టీలు అండ‌గా నిలుస్తున్నాయి. మేమున్నామంటూ ఇండ్ల జాగ కోసం పోరాడుతున్నాయి. గ‌తంలోనూ ఆయా పార్టీల ఆధ్వ‌ర్యంలో న‌గ‌రంలో అనేక కాల‌నీలు ఏర్ప‌డ‌గా అందులో వేలాది సంఖ్యలో పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌తుకుతున్నారు. తాజాగా ఓరుగ‌ల్లులో పేద‌ల ఇండ్ల జాగ కోసం మ‌ళ్లీ క‌మ్యూనిస్టు పార్టీల నేతృత్వంలో భూ పోరాటాలు ఉధృతంగా కొన‌సాగుతున్నాయి.

సీపీఐ ఆధ్వ‌ర్యంలో…

భార‌త క‌మ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వ‌ర్యంలో గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప‌రిధిలో ఇటీవ‌ల భూపోరాటాలు ఊపందుకున్నాయి. వ‌రంగ‌ల్‌, హన్మ‌కొండ‌, కాజీపేటలో ప్రాంతాల్లోని వేలాది ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల్లో నిరు పేద‌లు గుడిసెలు వేసుకుంటున్నారు. ఈక్ర‌మంలోనే మ‌డికొండ శివారులోని రాయ‌న‌బండ‌లోని స‌ర్వే నంబ‌ర్ 1296 నంబ‌ర్ల‌లోని సుమారు 31 ఎక‌రాలు, గుండ్ల సింగారంలోని 174, 175 స‌ర్వే నంబ‌ర్ల‌లోని సుమారు 24 ఎక‌రాలు, వ‌రంగ‌ల్ మ‌ట్టెవాడ శివారు నిమ్మాయ చెరువులోని సుమారు 16 ఎక‌రాలు, బొల్లికుంట‌లోని ఆరెక‌రాలు ఇర‌వై గుంట‌లు, హ‌స‌న్‌ప‌ర్తి శివారు వంగ‌ప‌హాడ్‌లో స‌ర్వే నంబ‌ర్ 516 లోని 3 ఎక‌రాల్లో సీపీఐ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో పేద‌లు గుడిసెలు వేసుకున్నారు. అంతేగాక‌.. క‌న్నారం, పీస‌ర గ్రామాల మ‌ధ్య సాగుభూమి 1200 ఎక‌రాల్లో కూడా ఎర్ర‌జెండాలు పాతారు.

సీపీఎం ఆధ్వ‌ర్యంలో..

ఖిలా వరంగల్ మండల పరిధి, తిమ్మాపూర్‌, బెస్తం చెరువు, జక్కలొద్ది, రంగశాయిపేట శివారు ప్రాంతం,
శిఖం సర్వే నెంబర్ 102/1, 105/1, 106/1, 107/1, బి, 108/1, 120/1, 119/9, 121/1, 121/2, 128/2, 180,181,182 స‌ర్వే నంబ‌ర్ల‌తోపాటు మామూనూర్ శివారు పుట్టకోట భూముల్లో పేద‌లు సీపీఎం ఆధ్వ‌ర్యంలో గుడిసెలు వేసుకున్నారు. అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూముల‌ను పేద‌ల‌కు పంచాల‌ని ఆపార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పేదవారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. పేద‌ల‌కు జాగ‌లు ద‌క్కేవ‌ర‌కూ భూపోరాటాలు ఆపేదిలేద‌ని, పోలీసుల కేసులు, హ‌చ్చ‌రిక‌ల‌కు భ‌య‌ప‌డేదిలేద‌ని నేత‌లు తేల్చిచెబుతున్నారు. మొత్తంగా ఓరుగ‌ల్లులో జ‌రుగుతున్న భూపోరాటాలు రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఓరుగ‌ల్లులో కొన‌సాగుతున్న భూపోరాటాల స్ఫూర్తితో రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో క‌మ్యూనిస్టు పార్టీలు భూపోరాటాల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img