- కొద్దిరోజుల్లో జిల్లా కాంగ్రెస్‌లో ప్రక్షాళన!
- కొత్త అధ్యక్షుడు ఎవరంటూ జోరుగా చర్చ
- గాంధీ భవన్‌కు క్యూ కడుతున్న ఆశావహులు
- బలంగా వినిపిస్తున్న వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పేరు
- బీసీల నుంచి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు..
- ఎస్టీల నుంచి దస్రునాయక్, నునావత్ రాధ
- ఎస్సీల నుంచి హెచ్ వెంకటేశ్వర్లు, కత్తి స్వామి..
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలుకానుందా..? నాయకత్వంలో పెనుమార్పులు రానున్నాయా..? ఈసారి జనాబా దామాషా ప్రకారం డీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారా..? ప్రస్తుత మానుకోట డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి ఇక మాజీ కానున్నారా..? పలువురు ఆశావహులు ఎవరికివారుగా గాంధీభవన్‌కు క్యూకడుతున్నారా..? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మరికొద్ది రోజుల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని ప్రక్షాళన చేయడం ఖాయమని, నాయకత్వంలో ఊహకందని మార్పులు ఉంటాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే మానుకోట జిల్లా కాంగ్రెస్‌కు కూడా కొత్త ప్రసిడెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు నాయకులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంలోని పెద్దలను కలిసి.. ఎవరికివారుగా తమ బలాన్ని చూపించుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా పార్టీ శ్రేణుల్లో తమకు కొత్త నాయకుడు ఎవరొస్తారన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
జోరుగా ఆశావహుల ప్రయత్నాలు
మానుకోట జిల్లా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పలువురు నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో ప్రధానంగా రెడ్యాలకు చెందిన యువ నేత వెన్నం శ్రీకాంత్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డి ఉన్నత విద్యావంతుడు. కొన్ని నెలల కిందట ఆయన టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రజల్లో, ముఖ్యంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది. డీసీసీ పదవి తమ నాయకుడికే వస్తుందన్న నమ్మకంతో అనుచరులు ఉన్నారు. అలాగే.. భరత్‌చందర్‌రెడ్డి దగ్గరి బంధువైన కంకర అయ్యప్పరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక బీసీ సామాజికవర్గం నుంచి జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు పేరు బలంగా వస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, వివిధ పదవుల్లో ప్రజాప్రతినిధిగా మంచి గుర్తింపు పొందారు. ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి కేసముద్రం మండలానికి చెందిన దస్రునాయక్, గూడూరు మండలం రాములుతండాకు చెందిన జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నునావత్ రాధ, ఎస్సీల నుంచి నెల్లికుదురుకు చెందిన హెచ్ వెంకటేశ్వర్లు, గూడూరుకు చెందిన కత్తి స్వాతి పేర్లు వినిపిస్తున్నాయి. అందరూ కూడా పార్టీలో చురుకైనా నాయకులుగా కొనసాగుతున్నారు.
ఎవరిదారి వారిదే..
మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎంతో బలంగా ఉంది. ప్రతీ గ్రామంలో స్థిరమైన ఓటుబ్యాంకు ఉంది. కానీ.. పార్టీ నాయకుల తీరువల్లే పార్టీ నిర్మాణం దెబ్బతింటుందనే టాక్ ఉంది. పార్టీలో అనేక గ్రూపులు ఉన్నాయి. కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన నేతలు.. ఎవరికివారుగా గ్రూపులుగా విడిపోయి ఉండడంతో కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్ భరత్‌చందర్‌రెడ్డికి సంబంధంలేకుండానే.. పలువురు నాయకులు నేరుగా గాంధీభవన్‌కు వెళ్లి పదవులు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరిదారి వారిదే.. ఎవరి కార్యక్రమాలు వారివే. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ ముందుకు నడిపించే నాయకుడే కనిపించడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకర్తలో కొంత జోష్ కనిపిస్తోంది. ఇక మొత్తంగా పార్టీ నాయకత్వంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా పార్టీ శ్రేణులే బహిరంగంగా అంటున్నాయి. ఈ నేపథ్యంలో డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.