- నియోజకవర్గంలో వేలాదిమంది బాధితులు
- రమణారెడ్డి భూదందాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- కేటీఆర్ సభలోనే బాధితుల నిరసనే నిదర్శనం
- ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదంటూ ప్రచారం
అక్షరశక్తి, భూపాలపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ధరణి పోర్టల్ దెబ్బ పడనుందా..? ఈ ఎన్నికల్లో అనేకమంది అభ్యర్థుల ఓటమికి ప్రధాన కారణం కానుందా..? ఇందులో భూపాలపల్లి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఉండబోతున్నారా..? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో గండ్ర వెంకటరణమారెడ్డిపై అనేక భూదందాల ఆరోపణలు బలంగా ఉన్నాయి. దశాబ్దాలుగా సాగులో ఉన్న అనేక మంది రైతులు.. ధరణి పోర్టల్‌తో భూములు కోల్పోయారనే వాదన బలంగా ఉంది. ఈ భూములను బినామీల పేర్లపై ఎమ్మెల్యే గండ్ర దక్కించుకుని దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేతోపాటు పలువురు గులాబీ నేతలు కూడా ఈ దందాలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇలా.. ధరణిపోర్టల్ కారణంగా భూపాలపల్లి నియోజకవర్గంలో సుమారు 400 ఎకరాల భూములను రైతులు కోల్పోయారని, నేడు వారంతా ఈఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో గండ్రకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం.
భూపాలపల్లిలో 400 ఎకరాలు..!
గ్రామాల్లో బలమైన విప్లవోద్యమ నేపథ్యంలో అనేక మంది భూస్వాములు తమ భూములను వదిలేసి పట్టణాలకు తరలివెళ్లారు. ఇవే భూములను అప్పట్లో విప్లవ పార్టీలు పేదలకు పంచాయి. అప్పటి నుంచి ఆ పేదలే భూముల్లో పంటలు పండించుకుని ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నారు. మరోవైపు, ఇదే సమయంలో అనేకమంది భూస్వాములు తమ భూములను సాధారణ పేపర్‌పై రాయించుకుని ఎంతోకొంతకు స్థానిక రైతులకు అమ్ముకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలా ఆ భూముల్లో రైతులు సాగులో ఉండడంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఆయా రైతులకు పంట రుణాలు కూడా అందించాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో ఆనాటి భూస్వాముల పేర్లపైనే పట్టాలు ఉండడంతో తిరిగి గ్రామాలపై గద్దళ్లా వాలుతున్నారు. ఇవి తమ భూములేనని, తమకు తిరిగి ఇవ్వాలని స్థానిక రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేడు ఆ భూములను విలువపెరడంతో రైతులను బెదిరింపులకు గురిచేస్తూ ఎంతోకొంత డబ్బు అప్పగిస్తూ భూములను లాగేసుకుంటున్నారు. ఈ దందా అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు పలువురు గులాబీదళ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా భూపాలపల్లి నియోజకవర్గంలో సుమారు 400 ఎకరాల భూములను రైతులను కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులందరూ గండ్రపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గండ్ర భూదాందాలు..?
భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులు గడిచిన ఐదేళ్లలో అనేక భూదందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భూపాలపల్లి పట్టణంలో నిరుపేదలు 15 ఏళ్ల క్రితం ఒక వెంచర్‌లో కొనుక్కున్న 100 గజాలు, 200 గజాల భూములకు ఇప్పుడు విలువ పెరగడంతో ఆ భూముల యజమానులకు ధరణిలో వచ్చిన పాస్‌బుక్కుల ఆధారంతో కొత్త రిజిస్ట్రేషన్లు చేపించుకొని రమణారెడ్డి బినామీ అనుచరులతో కబ్జాలోకి వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే కేటీఆర్ భూపాలపల్లిలో సభ నిర్వహించిన సందర్భంగా బాధితులంతా వచ్చి రమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అంతేగాకుండా, నియోజకవర్గంలోని వెంచరామీ, కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల భూములు కొనుగోలు చేసి అందులో ఓ ప్రభుత్వ పెద్దకు వాటా ఇచ్చి ఏదైనా సబ్సిడీతో కూడిన పరిశ్రమ తెచ్చుకోవాలని రమణారెడ్డి ప్లాన్ వేసినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాత పట్టాదారులతో కుమ్మక్కు
భూపాలపల్లి నియోజకవర్గంలోని నైన్ పాక, గిద్దె ముత్తారం, రాఘవపూర్, వెలిశాల గుట్ట మధ్యలో ఉన్న వందలాది ఎకరాల భూములను ఓ గులాబీ దళనేత సహకారంతో ధరణి పోర్టల్‌లో నమోదు అయిన పాత పట్టాదారులతో ఆ భూములను అగ్రిమెంట్ చేయించుకొని పామాయిల్ తోటలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పెంచుతున్నట్లు తెలుస్తోంది. సుమారు మూడు వేల కోట్ల విలువైన పామాయిల్ ఫ్యాక్టరీలను కట్టేందుకు ప్రభుత్వం నుంచి వందల కోట్ల విలువైన సబ్సిడీతో కూడిన ఈ పరిశ్రమను మంజూరు చేయించుకున్నారు. దీనికి తోడు భూపాలపల్లి టౌన్‌కు అందుబాటులో ఉన్న కాశీంపల్లి, వేషాలపల్లి, గొర్లవీడు, కొంపల్లి, చెల్పూరు మొరంచపల్లి, కరకపల్లి గ్రామాల మధ్యగా అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో బైపాస్ రోడ్డు వేసేందుకు సర్వే చేయించుతుండగానే వందలాది ఎకరాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.