- దక్కని వరంగల్ పశ్చిమ టికెట్
- తీవ్ర అసంతృప్తిలో రాఘవరెడ్డి
- ఇప్పటికీ స్పందించని అధిష్ఠానం
- స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే దిశగా అడుగులు
- కలిసి నడుస్తామంటున్న ఉమ్మడి జిల్లా అనుచరులు
- ఐదు నియోజకవర్గాల్లో పార్టీపై ప్రతికూల ప్రభావం
- జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట అభ్యర్థుల్లో ఆందోళన
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్, సీనియర్ నాయకుడు జంగా రాఘవరెడ్డి కదలికలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో తన బలమెంతో నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. నిరంతరం తన అనుచరులతో విస్తృతంగా చర్చిస్తూ.. కార్యాచరణ రూపొందించే పనిలో బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అనుచరులంతా.. జంగాతో కలిసి నడిచి, ఎన్నికల్లో అండగా నిలబడుతామని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయనే టాక్ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా వరంగల్ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఈ నియోజకవర్గాల్లో బలంగా ఉన్న జంగా అనుచరుల మద్దతు లభించడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది.
ఐదు నియోజకవర్గాలపై పట్టు…
ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన జంగా రాఘవరెడ్డికి బలమైన అనుచరగణం ఉంది. పార్టీ పెద్దల సూచనల మేరకు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పాలకుర్తి నియోజవకర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. 2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 64వేలకుపైగా ఓట్లు సాధించారు. గత రెండు ఎన్నికల్లో కన్నా.. రాఘవరెడ్డి ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. ఇక జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌గా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణాన్ని తయారు చేశారు. ఇదే సమయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ జంగా రాఘవరెడ్డి పర్యటించారు. గత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజవర్గాల్లోని పలు డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలిచారు. ముందుండి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పశ్చిమలోని 62, 63 డివిజన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అంతేగాకుండా, వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు డివిజన్లలోనూ జంగా రాఘవరెడ్డికి బలమైన అనుచరులు ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం
ఎలాగైనా తనకు టికెట్ వస్తుందన్న నమ్మకంతో జంగా రాఘవరెడ్డి వరంగల్ పశ్చిమలో విస్తృతంగా పర్యటిస్తూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్లారు. అయితే, టికెట్ కోసం పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డిలిద్దరూ గట్టి పోటీ పడ్డారు. ఎంతో ఉత్కంఠ రేపిన అభ్యర్థి ఎంపిక.. చివరకు రెండో జాబితాలో నాయినికే టికెట్ దక్కింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జంగా రాఘవరెడ్డి తన అనుచరులతో సమావేశం నిర్వహించి, పార్టీ అధిష్ఠానం, నాయినిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానంటూ.. ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీ అధిష్ఠానం కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనుచరులతో నిరంతరం చర్చిస్తున్న రాఘవరెడ్డి.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే టాక్ వినిపిస్తోంది. ప్రధానంగా జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు రాఘవరెడ్డి అనుచరులు, అభిమానులు సహకరించడం కష్టమేననే వాదన ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్ననట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.