- లక్షలాదిగా తరలివచ్చిన శ్రేణులు
- క్యాడర్‌లో నూతనోత్సాహం
- నాయకుల్లో నయా జోష్..
- జై కాంగ్రెస్… జైజై రాహుల్ నినాదాలతో దద్దరిల్లిన ఓరుగల్లు
జై కాంగ్రెస్… జైజై కాంగ్రెస్ నినాదాలతో ఓరుగల్లు దద్దరిల్లింది. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతం అయింది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పార్టీ అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. నగరానికి వచ్చే నలుదిక్కులు.. వాహనాల క్యూనే కనిపించింది. ప్రధాన రహదారుల్లో పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది. సభకు సమయానికి ముందే నగర శివార్ల వరకూ వాహనాలు తట్టడంతో.. సభకు చేరుకోవడం కష్టంగా మారింది. కిలోమీటర్ల దూరం నుంచి పార్టీ శ్రేణులు కాలినడకనే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. భారీ ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో సభా వేదిక పరిసరాల్లో సందడి నెలకొంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లించడంతో పాటు వాహనదారుల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్టీ నేతలు ఊహించినదానికంటే శ్రేణులు తరలిరావడం, సభ సక్సెస్ అవడంతో నాయకుల్లో నయా జోష్ కనిపించింది.
రాహుల్‌కు ఘన స్వాగతం
హన్మకొండలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాగా, ఆయనకు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో హనుమకొండ కు చేరుకోగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించారు.