- రైతులపై బూతులతో పరువు పాయె!
- ఆడవాళ్లపైనా అసభ్య పదజాలం!
- ఆ నేత మేత కోసం దిగజారుడుతనం
- పోలీస్ వ్యవస్థకు తలవొంపులు తెస్తున్న వైనం
- సుమారు మూడేళ్లుగా ఒకే నియోజకవర్గంలో తిష్ట
- ఛీచీ అంటూ సీఐ, ఎస్సైని చీదరించుకుంటున్న జనం
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : ఆయన సీఐ.. కాదు కాదు ఛీఐ! రాష్ట్ర ప్రభుత్వమేమో ఫ్రెండ్లీ పోలీస్ అంటుంటే.. ఆయన మాత్రం ఏక్‌నంబర్ కంత్రీగా వ్యవహరిస్తున్నారు. ఓ అధికార పార్టీ నేత పెట్టే మేత కోసం జారాల్సినదానికన్న ఎక్కవగా దిగజారిపోయారు. తనకూ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయారు. ఓ రైతును అనరాని మాటలని, తిట్టరాని తిట్లు తిట్టి పరువుపోగొట్టుకున్నారు. అందరూ ఛీఛీ.. సీఐ! అనే పరిస్థితిని చేజేతులా తెచ్చుకున్నారు. చివరకు పోలీస్ వ్యవస్థకు తలవొంపులు తెస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా.. ఆ ఛీఐ రైతును తిట్టిన తిట్లే చర్చకు వస్తున్నాయి. ఇప్పుడాయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనేకాదు.. ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయారు. ఇక ఇదే సమయంలో తమ కోసం ఎక్కడిదాకైనా దిగజారిపోయే పోలీస్ అధికారిని కాపాడుకోవడానికి ఆ అధికార పార్టీ నేత నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గ స్టేషన్లలోనే తిష్ట!
ఆ పోలీస్ అధికారి తీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పూర్తి విరుద్ధంగా ఆయన వ్యవహారం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు, బాధితులతో గౌరవంగా ఉండాల్సిన ఆయన నోరు తెరిస్తే.. పచ్చిబూతులు మాట్లాడడం అలవాటుగా మారిపోయింది. సుమారు మూడేళ్లుగా ఒకే నియోజకవర్గంలోని స్టేషన్లలోనే విధులు నిర్వర్తిస్తూ.. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రజల కోసం తక్కువగా.. నేత కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ సెటిల్‌మెంట్లు చేస్తూ.. కమీషన్లు దండుకుంటూ పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ గ్రామంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కొంత ఇబ్బంది కలిగేలా రైతుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో సదరు పోలీస్ అధికారి రెచ్చిపోయారు.
అంతా సీఐ కనుసన్నల్లోనే…
ఆ ఘటనపై స్థానిక ఎస్సైని అలర్ట్ చేయడం.. అర్ధరాత్రి దాటాక రైతుల ఇళ్లలో చొరబడి ముగ్గురిని స్టేషన్‌కు తీసుకువెళ్లడం, వాళ్ల అంగీలు విప్పించి, వాటితోనే రెక్కలు కట్టేసి చితకబాదుతూ రాక్షసానందం పొందడం చకచకా జరిగిపోయాయి. రైతులను కొడుతుండగానే.. కాల్ చేసిన సీఐ.. చెప్పలేని బూతులు తిట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రైతులు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎస్సై, సీఐల నిజస్వరూపాలు బట్టబయలయ్యాయి. వాళ్లిద్దరూ మనుషుళ్లా ప్రవర్తించలేదని, తమను దారుణంగా తిడుతూ, చివరకు ఆడవాళ్లపైనా అసభ్యపదజాలం వాడుతూ కొట్టారంటూ రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇదంతా కూడా అధికార పార్టీ నేత కోసం సీఐ కనుసన్నల్లోనే జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. సాధారణ ప్రజలు కూడా పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ఈ అమానవీయ ఘటనపై వరంగల్ సీపీకి కూడా రైతులు ఫిర్యాదు చేశారు. తమ తిట్టిన కొట్టిన సీఐ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.