- బీజేపీకి వరుస షాక్‌లు..?
- నేతల రాజీనామాలతో పార్టీ డీలా..
- కోమటిరెడ్డి బాటలో మరికొందరు నేతలు..?
- మొదటి విడత లిస్ట్ తో కమలనాథుల్లో చిచ్చు..
- అభ్యర్థుల ప్రకటనతో భగ్గుమంటున్న అసంతృప్తి
- బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు క్యూ..
- కేసీఆర్‌ను ఓడించే శక్తి కాంగ్రెస్‌కే ఉందంటూ వ్యాఖ్యలు
- ఎన్నికల ముంగిట గందరగోళంలో క్యాడర్ !
అక్షరశక్తి, హైదరాబాద్: నేతల వరుస రాజీనామాలతో తెలంగాణలో బీజేపీ డీలా పడుతోంది. అసెంబ్లీ ఎ న్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ఒక్కరొక్కరుగా కమలానికి కటీఫ్ చెప్తున్నారు. దీంతో గెలుపే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్న హైకమాండ్‌కు ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు. రాష్ట్రంలో కేసీఆర్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్న నేతలే తీరా ఎన్నికల ముం గిట కాడి పడేస్తూ పార్టీని వీడుతుండటంతో క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. మునుగోడు ఫలితం, తర్వాత కర్ణాటక రిజల్ట్స్, అనంతరం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను తప్పించడంతోపాటు కవిత అరెస్ట్ లాంటి పలు అంశాలు తెలంగాణలో బీజేపీ దూకుడుకు బ్రేక్ వేశాయి. ఈక్రమంలోనే నేతల చేరికలు ఆగిపోగా, ఇంతకాలం పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులు పలువురు వరుసగా రాజీనామాలు చేస్తుం డటంతో కమలంపార్టీ కకావికలం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను ఓడిం చడం బీజేపీతో సాధ్యంకాదని పార్టీని వీడుతున్న నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్‌ను ఓడించే శక్తి కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని చెప్తున్నారు. బీజేపీలో కొనసాగితే తమ పొలిటికల్ ఫ్యూచర్ దె బ్బతింటుందని పలువురు కమలం నేతలు కంగారుపెడుతున్నారు. అందుకే, బీజేపీని వదిలి కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు. మొత్తంగా మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉండగా పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరి ణామాలతో కమలం శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.
వరుస రాజీనామాలతో డీలా..
ఇప్పటికే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కమలం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయన బాటలోనే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి నడిచారు. తాజాగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాంరాం చెప్పారు. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మరికొందరు కీలక నేతలు బీజీపీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం హస్తం గూటికి చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా బీజేపీ జాతీయ నేతల వ్యవహారాల శైలి పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా జాతీయ నేతల శైలి ఉందని భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహం
తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇటీవల విడుదల చేసిన మొదటి విడత లిస్ట్ కమలనాథుల్లో చిచ్చురాజేసింది. టికెట్ దక్కనివారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు అధిష్టానం నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముథోల్ టికెట్ దక్కకపోవటంతో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. పటాన్‌చెరు టికెట్ ను నందీశ్వర్ గౌడ్ కు ఇవ్వడాన్ని ఎనిమిది మంది మండల, డివిజన్ బీజేపీ అధ్య క్షులు వ్యతిరేకిస్తున్నారు. పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మెదట లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డిని కలిసి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన ఆవేదనను వ్య క్తం చేశారు. మరోవైపు బీజేపీకి మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి రాజీనామాచేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.
రాకేశ్‌రెడ్డి అసంతృప్తి..!
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి టికెట్ ఆశించారు. రావు పద్మకు టికెట్ దక్కడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన రెబల్ గా ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. యువకులకు పార్టీలో కోటా లేదా ? అంటూ ఆయన అనుచరులు బీజేపీ అదిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజాసింగ్ పై ఉన్న సస్సెన్షన్ ఎత్తివేయడంతో గోషామహల్ టికెట్ ను మరోసారి ఆ పార్టీ అధిష్టానం రాజాసింగ్ కే కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, రాజాసింగ్ పై సస్పెన్ ఉండటంతో ఆ నియోజకవర్టంలో విక్రంగౌడ్ టికెట్ ఆశించాడు. అయితే, రాజాసింగ్ కు ఆ స్థానాన్ని మరోసారి కేటాయించడంతో తనకు ఇతర నియోజ కవర్గాల్లో సర్దుబాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విక్రమ్ గౌడ్ కలిశాడు.